Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు: పైనల్స్ లోకి చెన్నై సూపర్ కింగ్స్

ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ 12వ ఎడిషన్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి విజేతగా నిలిచింది. 

Chennai vs Delhi, Qualifier 2 Live updates,ipl 2019
Author
Chennai, First Published May 10, 2019, 7:48 PM IST

ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ 12వ ఎడిషన్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి విజేతగా నిలిచింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 

148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 62 బంతుల్లో 81 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు.  

ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఐపిఎల్ ఫైనల్స్ లో ఈ రెండు జట్లు పోటీపడడం ఇది నాలుగోసారి. 

చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్... చెన్నై సూపర్‌కింగ్స్‌కి 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై బౌలర్లు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఢిల్లీకి పరుగులు చేయడం కష్టంగా మారింది.

రిషభ్ పంత్ 38, మన్రో 27 పరుగులతో పోరాడారు. చివర్లో ఇషాంత్ శర్మ ఫోర్, సిక్సర్‌తో మెరవడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.  చెన్నై బౌలర్లలో చాహర్, హర్భజన్ సింగ్, బ్రావో, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. 

ధాటిగా ఆడిన పంత్ ఎట్టకేలకు ఔటయ్యాడు. చాహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రిషభ్ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌండరీ లైన్ వద్ద బ్రావోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

చివరి ఓవర్లలో ఢిల్లీ క్రమంగా వికెట్లు కోల్పోతోంది. బ్రావో తెలివిగా బౌలింగ్ చేయడంతో 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీమో పాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

స్కోరు బోర్డును పరిగెత్తించేందుకు భారీ షాట్‌కు ప్రయత్నించిన రూథర్‌ఫర్డ్.. హర్భజన్ మాయాజలానికి బలయ్యాడు. వాట్సన్‌కు క్యాచ్ ఇచ్చి 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు.

చెన్నై బౌలర్లు రెచ్చిపోతుండటంతో ఢిల్లీ వెంట వెంటనే వికెట్లు కోల్పోతూ వచ్చింది. అక్షర్ పటేల్ కేవలం 3 పరుగులకే బ్రావో బౌలింగ్‌లో ఔట్ అవ్వడంతో క్యాపిటల్స్ కష్టాల్లో పడింది.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పెవిలియన్ చేరడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. తాహిర్ బౌలింగ్‌లో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్‌కు యత్నించిన అయ్యర్ ... రైనాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

చెన్నై బౌలర్లు విజృంభిస్తుండటంతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఒత్తిడిలో పడుతున్నారు. రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మన్రో ఔటయ్యాడు. 

ఢిల్లీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. దూకుడు మీదున్న ఓపెనర్ శిఖర్ ధావన్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్భజన్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. పృథ్వీషా 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఐపీఎల్‌లో కీలకమైన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios