ఐపీఎల్ 2022 మెగా వేలం చర్చల్లో పాల్గొన్న మహేంద్ర సింగ్ ధోనీ... జార్ఖండ్‌లో ప్రాక్టీస్ మొదలెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్...
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని ఏడాదిన్నర దాటిగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్ గెలిచి, చెన్నై సూపర్ కింగ్స్‌కి నాలుగో టైటిల్ అందించిన ఎమ్మెస్ ధోనీ, ఐపీఎల్ 2022 సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలెట్టేశాడు...
సురేష్ రైనా, అంబటి రాయుడు వంటి క్రికెటర్లతో పోలిస్తే మహేంద్ర సింగ్ ధోనీ, దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో కూడా పాల్గొనడానికి ఇష్టపడడం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా, అంబటి రాయుడు... దేశవాళీ టోర్నీల్లో పాల్గొంటూ ప్రాక్టీస్ తప్పకుండా జాగ్రత్త పడుతున్నారు...
అయితే మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఐపీఎల్ మ్యాచులు తప్ప, మరో క్రికెట్ టోర్నీ ఆడడం లేదు. అందుకే ఐపీఎల్ సీజన్‌కి నెలన్నర ముందే ప్రాక్టీస్ మొదలెట్టేశాడు మాహీ. ఐపీఎల్ 2022 మెగా వేలానికి సంబంధించిన చర్చల్లో పాల్గొనేందుకు చెన్నై వెళ్లిన ఎమ్మెస్ ధోనీ, సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌తో కలిసి సమావేశమయ్యాడు...
ఆ తర్వాత జార్ఖండ్ చేరుకుని, జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (జేఎస్‌సీఏ) స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నాడు. గత సీజన్‌లో కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయినా, బ్యాట్‌తో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు ఎమ్మెస్ ధోనీ.
ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచుల్లో 25 సగటుతో 200 పరుగులు చేసి పర్వాలేదనిపించిన ఎమ్మెస్ ధోనీ, 2021 సీజన్‌లో 16 మ్యాచుల్లో 16.28 సగటుతో 114 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అత్యధిక స్కోరు 18 పరుగులు మాత్రమే...
ప్రాక్టీస్ విరామాల్లో సరదాగా గన్ పట్టి, షూటర్‌గా కొత్త అవతారం ఎత్తాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఎయిర్ రైఫిల్ గన్‌తో టార్గెట్‌ను గురిపెట్టి కొడుతున్న మాహీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. షూటింగ్‌తో పాటు కాసేపు టెన్నిస్ కూడా ఆడుతూ సేదతీరాడు మాహీ. 40 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ కావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది...
అందుకే ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో కెప్టెన్‌గా ఎమ్మెస్ ధోనీకి చోటు దక్కినా, మొదటి రిటెన్షన్‌గా కాకుండా రెండో రిటెన్షన్‌గా చోటు కల్పించింది టీమ్ మేనేజ్‌మెంట్. ఎమ్మెస్ ధోనీ రూ.12 కోట్లు తీసుకోబోతుంటే, మొదటి రిటెన్షన్ దక్కించుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రూ.16 కోట్లు అందుకోబోతున్నాడు...
రూ.8 కోట్లకు మొయిన్ ఆలీని రిటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్, రూ. 6 కోట్లకు యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను అట్టిపెట్టుకుంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో రూ.48 కోట్లు ఉన్నాయి. ఐపీఎల్ 2022 సీజన్‌లో రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్, యజ్వేంద్ర చాహాల్, అంబటి రాయుడితో పాటు చాలామంది విదేశీ క్రికెటర్లు కూడా... ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఆడాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టిన విషయం తెలిసిందే..
