Asianet News TeluguAsianet News Telugu

శాస్త్రి-కోహ్లీలు ఉన్నప్పుడు ఎట్లుండె.. ఇప్పుడెలా దిగజారింది? ట్వీట్‌ను రీట్వీట్ చేసిన సీఎస్కే..

WTC Final 2023: డబ్ల్యూటీసీ  ఫైనల్లో టీమిండియా  తడబడుతుండటాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.  ఒకప్పుడు దూకుడుగా ఉంటే టీమ్ లో ఇప్పుడు అది కరువైందని  వాపోతున్నారు.  

Chennai Super kings Retweet Post That Praising Kohli and Shastri Era as India Struggle in WTC Final 2023 MSV
Author
First Published Jun 9, 2023, 1:14 PM IST

డబ్ల్యూటీసీ ఫైనల్ లో భాగంగా రెండు రోజుల ఆటలో ఆస్ట్రేలియాకు సరెండర్ అయిన టీమిండియాపై భారత క్రికెట్ అభిమానులు  ఆగ్రహంగా ఉన్నారు.  విరాట్ కోహ్లీ - రవిశాస్త్రిల హయాంలో  టీమిండియాలో ఉన్న దూకుడు, తెగువ.. ఇప్పుడు కనిపించడం లేదని.. రోహిత్ - ద్రావిడ్ లు మరీ మెతకగా ఉంటూ  టీమ్  అగ్రెసివ్‌నెస్ ను దెబ్బతీస్తున్నారని వాపోతున్నారు. తాజాగా  ఇందుకు సంబంధించి  రవిశాస్త్రి గతంలో ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడిన ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. 

ఈ వీడియోలో రవిశాస్త్రి.. ‘పిచ్ ఏదైనా సరే. మేం దూకుడుగా ఆడతాం. మాకు  20 వికెట్లు (రెండు ఇన్నింగ్స్ లలో కలిపి)  కావాలి. అది ముంబై కావొచ్చు.. జోహన్నస్‌బర్గ్ కావొచ్చు.. అడిలైడ్ కావొచ్చు..  దూకుడే మా వైఖరి..’అని ఆవేశంగా చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను  ‘ఫర్ గోట్’అని రాసి ఉన్న విరాట్ అభిమాని ఒకరు షేర్ చేశాడు. 

 

ఈ వీడియోను  చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విటర్ ఖాతాలో రీట్వీట్ చేయడం గమనార్హం. సీఎస్కే ఈ వీడియోను షేర్ చేయడంతో రోహిత్ - ద్రావిడ్ ఫ్యాన్స్  విమర్శలు గుప్పిస్తున్నారు.  ఈ వీడియో ద్వారా సీఎస్కే ఏం చెప్పదలుచుకున్నదని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంకా ముగియలేదని.. రెండ్రోజులకే  రోహిత్ - ద్రావిడ్ పై  ఇలాంటి కామెంట్స్ చేయడం  తగదని సూచిస్తున్నారు. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో సీఎస్కే తర్వాత  ఈ ట్వీట్ ను డిలీట్ చేసింది.  

Chennai Super kings Retweet Post That Praising Kohli and Shastri Era as India Struggle in WTC Final 2023 MSV

ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే... ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులకు ఆలౌట్ అయింది.  ట్రావిస్ హెడ్ (163) వన్డే తరహా ఆట ఆడగా  స్టీవ్ స్మిత్ (121) సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్..  38 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి   151 పరుగులే చేసి తీవ్ర కష్టాల్లో ఉంది. రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (13), ఛటేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లీ (14) దారుణంగా విఫలమయ్యారు. రవీంద్ర జడేజా (48) కాస్త మెరుగ్గా ఆడినా ఆఖర్లో అతడు కూడా వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం  అజింక్యా రహానే (29 బ్యాటింగ్), కెఎస్ భరత్ (5 బ్యాటింగ్) లు క్రీజులో  ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది.  పాలో ఆన్ గండం (269) నుంచి తప్పించుకోవాలంటే భారత్ ఇంకా  118 పరుగులు చేయాలి.  మరి మూడో రోజు భారత జట్టు ఏం చేసేనో..? 

Follow Us:
Download App:
  • android
  • ios