ఎప్పుడు కూల్‌గా ఉండే ధోని.... గురువారం దురుసుగా ప్రవర్తించడంతో పాటు అసలు మైదానంలోకి ఎందుకు వెళ్లాడంటూ పలువురు ప్రశ్నించారు. దీనిపై చెన్నై సూపర్‌కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు
చెన్నైసూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘‘నో బాల్’’ వివాదం కలకలం రేపింది. మ్యాచ్ మధ్యలోకి ధోని వెళ్లడంతో అతనిపై రిఫరీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. కాగా ఎప్పుడు కూల్‌గా ఉండే ధోని.... గురువారం దురుసుగా ప్రవర్తించడంతో పాటు అసలు మైదానంలోకి ఎందుకు వెళ్లాడంటూ పలువురు ప్రశ్నించారు.
దీనిపై చెన్నై సూపర్‌కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు. నో బాల్ విషయంలో స్పష్టత కోసమే ధోని మైదానంలోకి వెళ్లాడని ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. అంపైర్ ఆ బంతిని నోబాల్ ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకోవడంతో తామంతా అయోమయానికి గురయ్యామని... ఇంతకు అది నోబాలా..? కాదా అనే సందిగ్థంలో పడ్డామన్నారు.
దీనిపై స్పష్టత కోసమే ధోని మైదనాంలోకి వెళ్లి అంపైర్లతో వాదనకు దిగాడని పేర్కొన్నాడు. ఇటువంటి కీలక పరిస్థితుల్లో ఎవరికైనా స్పష్టత అవసరం.. ఇది సరైనది కాకపోవచ్చు కానీ ధోనిని చాలా రోజులు చాలా సార్లు ప్రశ్నింస్తారు అంటూ ఫ్లెమింగ్ తెలిపాడు.
మరోవైపు ఐపీఎల్‌లో అంపైర్ల తప్పిదాలపై అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆటగాళ్లు తప్పులు చేస్తే జరిమానాలు విధిస్తున్నారని, మరి అంపైర్లు తప్పు చేస్తే శిక్షలు లేవా అని వారు ప్రశ్నిస్తున్నారు.
అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ధోని ఐపీఎల్ నిబంధన 2.20 అతిక్రమించాడని అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆఖరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. స్టోక్స్ బౌలింగ్ చేశాడు.
తొలి బంతిని జడేజా సిక్సర్ కొట్టాడు. తర్వాత స్టోక్స్ నోబాల్ వేయగా.. జడేజా సింగిల్ తీశాడు. ఫ్రీహిట్‌కు ధోని రెండు పరుగులు తీశాడు. తర్వాతి బంతికి మహీ ఔటయ్యాడు. చివరి మూడు బంతుల్లో చెన్నై 8 పరుగులు చేయాల్సి రావడంతో ఉత్కంఠ పెరిగిపోయింది.
నాలుగో బంతిని స్టోక్స్... క్రీజులో ఉన్న శాంట్నర్‌కు నడుం పైకి వేశాడన్న కారణంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. రెండు పరుగులు వచ్చాయి. అయితే ఇక్కడే అంపైర్లు వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.
నోబాల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. ఈ నిర్ణయంపై జడేజా అభ్యంతరం వ్యక్తం చేస్తుండగానే.. ధోని మైదానంలోకి దూసుకొచ్చాడు. అంపైర్లతో మహీ వాగ్వాదానికి దిగడంతో మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోయింది.
