IPL 2024 : వీరాభిమానం... పిల్లల స్కూల్ ఫీజుకు డబ్బులేవ్... కానీ ధోనిని చూసేందుకు రూ.64 వేలు 

మహేంద్ర  సింగ్ ధోనిపై తమిళ ప్రజల అభిమానం అంతాఇంత కాదు. ఇటీవల ధోనికోసమే చెన్నై ఆడే మ్యాచుల్లో ఫ్యాన్స్ పోటెక్కుతున్నారు. ఇలాంటి ఓ సూపర్ ఫ్యాన్ ధోనిని ప్రత్యక్షంగా చూసేందుకు ఏం చేసాడంటే... 

Chennai Super Kings fan spends 64 Thousands on IPL tickets to see MS Dhoni AKP

చెన్నై : మహేంద్ర సింగ్ ధోని... క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు.అద్భుతమైన బ్యాట్ మెన్, వికెట్ కీపర్ గానే కాదు టీమిండియా కెప్టెన్ గా ఎన్నో రికార్డులు, రివార్డులు సాధించడమే కాదు అద్భుత విజయాలు అందించారు. అతడి ధనాధన్ బ్యాటింగ్, హెలికాప్టర్ షాట్లు, వికెట్ కీపింగ్ ను ఇష్టపడని అభిమాని వుండడు. తన ఆటతోనే కాదు సింప్లిసిటీతోనూ అభిమానులను సంపాదించుకున్నారు ధోని. 

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ విషయానికి వస్తే మొదటినుండి చెన్నై సూపర్ కింగ్స్ లో కొనసాగుతున్నారు ధోని. చెన్నై టీం ధోని కెప్టెన్సీలో పలుమార్లు ఐపిఎల్ విజేతగా నిలిచింది. ఇలా చెన్నై టీంలో ఆడుతున్న ధోనిని తమిళ ప్రజలు తమవాడిని చేసుకున్నారు. ఎంతలా అంటే తమిళనాడుకు చెందిన క్రికెటర్స్ కంటే ధోనిని  అక్కడ క్రేజ్ ఎక్కువ. ధోనిని తమిళ్ ఫ్యాన్స్ 'థల(నాయకుడు)' అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. 

ధోనిపై తమిళ ప్రజల అభిమానం ఏ స్థాయికి చేరుకుందో తెలియజేసే సంఘటన ఒకటి వెలుగుచూసింది. ఇప్పటికి సిఎస్కే కెప్టెన్సీని వదులుకున్న ధోనికి ఇదే చివరి ఐపిఎల్ అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో చెన్నై మ్యాచ్ జరిగిందంటే చాలు ధోనిని చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తుతున్నారు. ఇలా ఓ అభిమాని తన ముగ్గురు బిడ్డలతో కలిసి ధోనిని చూసేందుకు మైదానానికి వచ్చాడు. కేవలం ధోనిని ప్రత్యక్షంగా చూసేందుకు ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ టికెట్స్ కోసం ఏకంగా రూ.64,000 ఖర్చు చేసినట్లు సదరు ఫ్యాన్ వెల్లడించాడు. తన పిల్లల స్కూల్ ఫీజు కట్టాల్సి వుంది...అందుకు తనవద్ద డబ్బులు లేవు... కానీ ధోనిపై అభిమానంతో భారీ డబ్బులతో ఐపిఎల్ టికెట్స్ కొన్నట్లు ధోని వీరాభిమాని తెలిపాడు. 

ఎంతో అభిమానించే ధోనిని ప్రత్యక్షంగా చూడాలని... అతడి ఆటను ఆస్వాదించాలని ఎప్పటినుండో కోరుకుంటున్నానని సదరు అభిమాని తెలిపారు. అయితే ఆ అవకాశం ఇప్పటివరకు రాలేదు... ఈ ఐపిఎల్ ధోనికి చివరిది కావడంతో ఈసారి కాకుంటే ఇంకెప్పుడు అతడి ఆటను చూడలేనని అర్థమయ్యిందని అన్నాడు. అందుకో ఏం చేసయినా ఈసారి సిఎస్కే మ్యాచ్ కు హాజరుకావాలని నిర్ణయించుకున్నా... టికెట్స్ కోసం ప్రయత్నిస్తే దొరక్కపోవడంతో రూ.64 వేలు పెట్టి బ్లాక్ లో కొనుక్కున్నట్లు తెలిపాడు. తన ముగ్గురు కూతుళ్లతో కలిసి మ్యాచ్ చూసానని... ధోనిని చూసిన ఆనందంలో ఇంటికి వెళుతున్నట్లు సదరు ఫ్యాన్స్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. 

 

పిల్లల స్కూల్ ఫీజు కట్టేందుకు డబ్బులు లేవుకానీ ధోనిని చూసేందుకు డబ్బులు వచ్చాయా అంటూ కొందరు ఆ అభిమాని తీరును తప్పుబడుతుంటే మరికొందరు అతడి అభిమానం అద్భుతమని అంటున్నారు. తన పిల్లలతో కలిసి అభిమాన క్రికెటర్ ఆటను ప్రత్యక్షంగా చూసి జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలను మిగిల్చాడని అంటున్నారు. తన అభిమాన ఆటగాన్ని చూసేందుకే ఎంతో ఖర్చుచేసాడు... సొంత పిల్లల ఫీజును కట్టలేడా... ఎలాగోలా వారి ఫీజులు కట్టగలడు...  అభిమానిగానే కాదు తండ్రిగాను గెలుస్తాడని నమ్ముతున్నామని అంటున్నారు. ఇలా సదరు ధోని అభిమాని తీరుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios