Asianet News TeluguAsianet News Telugu

చెన్నై విజయాల ‘‘సిక్సర్’’: రాజస్థాన్‌పై సూపర్‌కింగ్స్ విజయం

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఎదురు లేకుండా దూసుకుపోతూ విజయాల సిక్సర్ కొట్టింది. గురువారం జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ధోని సేన 7 వికెట్ల తేడాతో ఓడించింది. 

chennai super kings beat rajasthan royals
Author
Jaipur, First Published Apr 12, 2019, 7:42 AM IST

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఎదురు లేకుండా దూసుకుపోతూ విజయాల సిక్సర్ కొట్టింది. గురువారం జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ధోని సేన 7 వికెట్ల తేడాతో ఓడించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌కు ఓపెనర్లు రహానె, బట్లర్ శుభారంభాన్నా అందించింది. అయితే జోరుమీదున్న రహానెను దీపక్ చాహర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత బట్లర్‌, శాంసన్‌ వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది.

ఈ స్థితిలో స్మిత్, త్రిపాఠి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే జడేజా వీరిద్దరిని వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. మళ్లీ కష్టాల్లో పడిన జట్టును స్టోక్స్ ఆదుకున్నాడు. చివర్లో శ్రేయాస్ గోపాల్, ఆర్చర్ దూకుడుగా ఆడటంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

చెన్నై బౌలర్లలో జడేజా, శార్థూల్, చాహర్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వాట్సన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే రైనా రనౌట్ అయ్యాడు.

దీని నుంచి కోలుకునే లోపు డుప్లెసిస్, కేదార్ జాదవ్ కూడా పెవిలియన్ చేరడంతో చెన్నై 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ ధోని, రాయుడితో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

వీరిద్దరూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో అర్థసెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన దశలో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది.

భారీ షాట్‌కు ప్రయత్నించిన రాయుడు ఔట్ కాగా.. ఆఖరి ఓవర్లో 18 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికి జడేజా సిక్స్ కొట్టగా రెండు ఫ్రీ హిట్‌లకు మూడు పరుగులు వచ్చాయి. తర్వాతి బంతికి ధోని ఔట్ అవ్వడంతో ప్రేక్షకుల్లో టెన్షన్ పెరిగిపోయింది.

ఆఖరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా.. శాంటర్న్ కళ్లు చెదిరే సిక్స్ కొట్టి చెన్నైని గెలిపించాడు. తద్వారా చెన్నై ఐపీఎల్‌లో ఆరో విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ధోనికి ఇది 100వ విజయం..

చెన్నై తరపున మొత్తం 166 మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా 65 మ్యాచ్‌లలో సూపర్‌కింగ్స్ ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అలాగే స్మిత్‌ను ఔట్ చేయడం ద్వారా జడేజా ఐపీఎల్‌లో 100వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios