చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ యువ దీపక్ చాహర్ మంగళవారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ఐపిఎల్ లో ఓ నయా రికార్డును నెలకొల్పాడు. బ్యాట్ మెన్స్ కు అనుకూలంగా వుండే టీ20 లో ఏకంగా 20 డాట్  బాల్స్ వేసి చాహర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. నాలుగు ఓవర్లు వేసిన చాహర్ అందులో 20 బంతులకు ఒక్క పరుగు కూడా రాకుండా చూసుకున్నాడు. ఇలా ఒక్క మ్యాచ్ తో సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 

ఇలా పొదుపుగా బౌలింగ్ చేసిన చాహర్ 4 ఓవర్లలో 20 పరుగులను మాత్రమే సమర్పించుకున్నాడు. ఇక కోల్ కతా ఇన్నింగ్స్  చివర్లో 19వ ఓవర్ బౌలింగ్ చేసిన చాహర్ ధనా ధన్ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడే రస్సెల్స్ ని ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ ఓవర్లో ఐదు బంతులను డాట్ చేసి కేవలం ఒక్క బంతికి మాత్రమే పరుగులు ఇచ్చాడు. బంతి రస్సెల్స్ కి చిక్కకుండా బౌలింగ్ చేశాడంటే చాహర్ ఎంత వైవిధ్యంగా బౌలింగ్ చేశాడో అర్థమవుతుంది. 

కోల్ కతా ఇన్నింగ్స్ మొదట్లో కూడా చాహర్ బౌలింగ్ అదిరింది. ఓపెనర్ క్రిస్ లిన్ ను తన మొదటి ఓవర్లోనే డకౌట్ చేసిన చాహర్ ఆ తర్వాత వరుస ఓవర్లలో నితీష్ రానా(0), రాబిన్ ఊతప్పలను పెవిలియన్ కు పంపించాడు. ఇలా వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి కోల్ కతా బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు. 

చాహర్ అద్బుతమైన బౌలింగ్ ముందు నిలవలేక పోయిన కోల్‌కతా 108 పరుగులకే పరిమితమైంది. దీంతో 109 పరుగుల స్వల్ప లక్ష్యచేధన కోసం బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16 బంతులు మిగిలుండగానే ఛేదించింది. చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన చాహర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.