Asia Cup 2022 Final: యూఏఈ వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన  ఆసియా కప్-2022 ఫైనల్లో  శ్రీలంక.. పాకిస్తాన్ ను ఓడించి తమకు అచ్చొచ్చిన  ఆసియా కప్ ట్రోఫీని ఆరోసారి గెలుచుకుంది. 

మూడు వారాలుగా క్రికెట్ అభిమానులను అలరించిన ఆసియా కప్ ముగిసింది. ఆదివారం (సెప్టెంబర్ 11) రాత్రి పాకిస్తాన్-శ్రీలంక మధ్య ముగిసిన తుదిపోరులో లంకేయులు.. 23 పరుగుల తేడాతో పాకిస్తాన్ ను ఓడించి ఆరోసారి ఆసియా కప్ ను గెలుచుకుంది. అయితే ఈ టోర్నీలో పలువురు ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనలతో ‘టాప్’ లేపారు. బ్యాటర్లు, బౌలర్ల జాబితాలో అత్యధిక పరుగులు చేసి, వికెట్లు తీసిన ఆటగాళ్లలో భారత క్రికెటర్లు ముందు వరుసలో ఉన్నారు. 

ఆసియా కప్ -2022లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. 5 మ్యాచుల్లో 5 ఇన్నింగ్స్ లు ఆడి 92 సగటుతో 276 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. 6 మ్యాచుల్లో 6 ఇన్నింగ్స్ లు ఆడి 281 పరుగులు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు.

లంకతో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా రిజ్వాన్.. కోహ్లీని అధిగమించి బ్యాటర్లలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రిజ్వాన్.. ఆసియా కప్ లో మూడు హాఫ్ సెంచరీలు చేయగా కోహ్లీ మాత్రం రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఓ సెంచరీ కూడా చేశాడు. ఈ టోర్నీలో కోహ్లీ తప్ప మిగిలిన ఆటగాడెవరూ సెంచరీ చేయలేదు. అత్యధిక పరుగుల జాబితాలో రిజ్వాన్, కోహ్లీ తర్వాత అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (5 మ్యాచులు 196 పరుగులు), శ్రీలంకకు చెందిన భానుక రాజపక్స (6మ్యాచుల్లో 191), పతుమ్ నిస్సంక (6 మ్యాచుల్లో 173 పరుగులు) ఉన్నారు.

బౌలర్ల విషయానికొస్తే.. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ముందున్నాడు. భువీ 5 మ్యాచుల్లో 11 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఆ తర్వాత శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ.. 6 మ్యాచుల్లో 9 వికెట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత జాబితాలో పాక్ బౌలర్లు మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హరీస్ రౌఫ్ లు (ఒక్కొక్కరు 8 వికెట్లు) ఉన్నారు.

Scroll to load tweet…

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన పాకిస్తాన్ - శ్రీలంక తుది పోరులో లంక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 71 పరుగులతో నాటౌట్ గా నిలిచిన భానుక రాజపక్సకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నీ ఆసాంతం ఆల్ రౌండ్ ప్రదర్శనతో లంక విజయాల్లో కీలక పాత్ర పోషించిన వనిందు హసరంగకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతమైంది. 

Scroll to load tweet…