న్యూఢిల్లీ: హైదరాబాదీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ పై టీమిండియా క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ప్రశంసల జల్లు కురిపించాడు. ట్వంటీ20లకు మిథాలీ రాజ్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. భారత మహిళా క్రికెటర్ దిగ్గజం మిథాలీ రాజ్ కోట్లాది మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందని ఆయన అన్నాడు. 

మిథాలీ రాజ్ ను ఉద్దేశిస్తూ పుజారా ట్వీట్ చేశాడు. గొప్ప అంతర్జాతీయ టీ20 కెరీర్ కలిగి ఉన్న నీకు అభినందనలు అని అన్నాడు. మిథాలీ రిటైర్మెంట్ పై ప్రముఖ క్రికెట్ క్రీడా వ్యాఖ్యాత హర్షా బోగ్లే కూడా ట్వీట్ చేశాడు. టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచావని, 2021 ప్రపంచ కప్ లో నీ పోరాటం కోసం ఎదురు చూస్తున్నానని ఆయన అన్నాడు. 

2-21 వన్డే ప్రపంచ కప్ పోటీలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు ట్వంటీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు మిథాలీ రాజ్ ప్రకటించింది. 2006లో ఇంగ్లాండుపై ఆమె తొలి టీ20 ఆడింది. 89 మ్యాచుల్లో 37.5 సగటుతో 2,364 పరగుులు చేసింది. 

మిథాలీ రాజ్ అత్యుత్తమ స్కోరు 97 పరుగులు. టీ20 ఫార్మాట్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా రికార్డు సాధించింది.