196 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పూజారా...టెస్టు కెరీర్‌లోనే అతి నెమ్మదైన హాఫ్ సెంచరీ...విజయానికి 110 పరుగుల దూరంలో టీమిండియా...

గత 30 ఏళ్లల్లో ఆస్ట్రేలియాకి ఓటమి లేని స్టేడియంలో... ఆసీస్‌కి చెమటలు పట్టిస్తోంది టీమిండియా. నాలుగో ఇన్నింగ్స్‌లో 328 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా... 75 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.

టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా 196 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో పూజారాకి ఇదే అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీ. ఇంతకుముందు సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకునేందుకు 174 బంతులు ఆడిన పూజారా, నేడు మరో 22 బంతులు ఎక్కువగా వాడుకున్నాడు.

అతనితో పాటు రిషబ్ పంత్ 31 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రిషబ్ పంత్, ఛతేశ్వర్ పూజారా కలిసి నాలుగో వికెట్‌కి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. విజయానికి ఇంకా 110 పరుగుల దూరంలో ఉంది టీమిండియా. అయితే ఆఖరి రోజు ఆట ముగియడానికి ఇంకా ఒకే గంట గడువు ఉండడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.