India vs New Zealand: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి టాస్ ఓడిపోయాడు. ఓ చెత్త రికార్డుతో బ్రియాన్ లారా సరసన నిలిచాడు.
IND vs NZ Final Live: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium)లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో చెత్త రికార్డును తన పేరుమీద లిఖించుకున్నాడు. వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్ గా చెత్త రికార్డు సాధించాడు. అలాగే, బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు. రోహిత్, లారాలు ఇద్దరు వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయారు.
టాస్ విషయంలో ఫైనల్ మ్యాచ్‌లో కూడా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు బ్యాడ్ లక్ కొనసాగింది. అయితే, భారత జట్టుకు ఇది గుడ్ న్యూస్ అని భారత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ టాస్ ఓడిన చాలా మ్యాచ్ లలో భారత్ విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ఇప్పటివరకు రోహిత్ శర్మ టాస్ గెలవలేకపోయాడు. కానీ, భారత జట్టు విజయాలు అందుకుంటూనే ఉంది. అంటే రోహిత్ శర్మ టాస్ ఓడితే భారత్ గెలుస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. రోహిత్ శర్మ టాస్ ఓడిపోయిన చెత్త రికార్డు విషయంలో గొప్ప క్రికెటర్ బ్రియాన్ లారా సరసన నిలిచాడు. రోహిత్ శర్మ వన్డేల్లో వరుసగా 12వ సారి టాస్ ఓడిపోయాడు. అతను చివరిసారిగా వన్డేలో 2023 నవంబర్‌లో టాస్ గెలిచాడు. ఆ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో వన్డే ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్ లో జరిగింది.
అయితే, రోహిత్ శర్మ టాస్ ఓడిపోయిన తర్వాత మనకు టాస్ తో పనిలేదు బాసు.. గెలుపు మనదే అనే విధంగా కామెంట్స్ చేస్తున్నట్టు లుక్ ఇచ్చాడు. అతని వాయిస్ వినిపించకపోయినా.. వీడియోలో అదే చెబుతున్నట్టు గా కనిపిస్తోంది. అవును నిజమే మరి రోహిత్ శర్మ టాస్ గెలిచిన.. ఓడినా భారత్ గెలుపు పక్కా అనే కామెంట్స్ వస్తున్నాయి.
వరుసగా టాస్ ఓడిపోవడంపై రోహిత్ శర్మ స్పందిస్తూ, భారత్ రెండోసారి బ్యాటింగ్ చేయడం ద్వారా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినందున టాస్ తో పెద్దగా తేడా ఏమీ లేదని అన్నారు. టాస్ విషయంలో ఆందోళన చెందవద్దని, బదులుగా ఫైనల్‌పై దృష్టి పెట్టాలని డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులతో మాట్లాడానని చెప్పారు.
"మేము ఇక్కడ చాలా సేపు ఉన్నాము, ముందుగా బ్యాటింగ్ చేసాము.. ముందుగా బౌలింగ్ చేసాము. కాబట్టి మొదటి ఇన్నింగ్స్, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ తో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. అలాగే, "ఇది మీకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, టాస్‌ను ఆట నుండి దూరం చేస్తుంది. రోజు చివరిలో, మీరు ఎంత బాగా ఆడాలనుకుంటున్నారనేది ముఖ్యం. మేము డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడినది అదే, టాస్ ఆలోచన వద్దు. బాగా ఆడండి అంతే చాలని" చెప్పాడు.
