శ్రీలంక జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఆ జట్టు మాజీ పేసర్ చమిందా వాస్‌ను శ్రీలంక క్రికెట్ నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. నియమించి కనీసం వారం రోజులు కూడా గడవకముందే... ఆయన తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. అది కూడా తనకు ఇచ్చే జీతం విషయంలో తేడాలు రావడంతో పదవికి రాజీనామా చేయడం విశేషం.

లంక జట్టు వచ్చే నెలలో పూర్తి స్థాయి సిరీస్ కోసం వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న డేవిడ్ సాకెర్ రాజీనామా చేయడం, అది తక్షణం అమల్లోకి రావడంతో అతడి స్థానంలో వాస్‌ను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన 54 ఏళ్ల డేవిడ్ సాకెర్ డిసెంబరు 2019లో శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, వ్యక్తిగత కారణాలతో కోచ్ పదవికి  రాజీనామా చేశాడు. 

దీంతో వెంటనే శ్రీలంక క్రికెట్.. చమిందా వాస్ ని నియమించారు. ఆయన కూడా ఇలా బాధ్యతలు చేపట్టగానే... అలా రాజీనామా చేయడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.  బోర్డుతో తన జీతం విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక జట్టు వెస్ట్ ఇండీస్ పర్యటనకు బయలుదేరుతున్న సమయంలో వాస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం.. జట్టును సమస్యల్లోకి నెట్టేసింది.

ఈ ఘటనపై శ్రీలంక బోర్డు కూడా స్పందించింది. అతని నియమ నిబంధనలను తాము అంగీకరించలేదని.. అందుకే రాజీనామా చేశాడని బోర్డు కూడా అంగీకరించింది.

ఇదిలా ఉండగా... వాస్..అక్టోబరు 2012లో న్యూజిలాండ్ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఆ తర్వాతి ఏడాది శ్రీలంక జట్టుకు బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి 2015 వరకు కొనసాగాడు. 2016లో ఐర్లండ్ అతడిని తమ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఇటీవలి వరకు శ్రీలంక హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా వాస్ పనిచేశాడు. వాస్ తన అంతర్జాతీయ కెరియర్‌లో 111 టెస్టుల్లో 355 వికెట్లు పడగొట్టాడు. 322 వన్డేల్లో 400 వికెట్లు తీశాడు.