టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనగానే.. ముందుగా ఎవరికైనా గుర్తుకువచ్చేది ఆయన చేసిన పరుగులు, రికార్డులే. అందుకే అభిమానులు ముద్దుగా కోహ్లీని రన్ మెషిన్ అని, రికార్డుల రారాజు అని పిలుచుకుంటారు. అయితే.. ఈ రన్ మెషిన్ కి గత కొంతకాలంగా ఏమైందో ఎవరికీ అర్థం కావడంలేదు. పరుగుల వరద కురిపించకుండా.. ఏదో ఆట ఆడానా లేదా అన్నట్లు ఆడుతున్నాడు. కనీసం ఒక్క సెంచరీ కూడా చేయకుండా విరాట్ కోహ్లీ ఓ సంవత్సరాన్ని ముగించడం గమనార్హం.

అండర్-19 ప్రపంచకప్ సాధించిన విరాట్ కోహ్లీ 2008లో నేరుగా టీమిండియాలో ప్రవేశించాడు. దంబుల్లాలో శ్రీలంకపై అరంగ్రేటం చేసి 12 పరుగులు సాధించాడు. ఆ ఏడాది ఐదు మ్యాచులు ఆడినప్పటికీ సెంచరీ మాత్రం కొట్టలేదు. కేవలం ఒక హాఫ్ సెంచరీతో ఆ ఏడాదిని పూర్తి చేశాడు. ఆ తర్వాత నుంచి అతని బ్యాట్ నుంచి శతకాలు జాలువారాయి.

2009లో 1, 2010లో 3, 2011లో 4,  2012లో 5, 2013లో 4, 2014లో 4, 2015లో 2, 2016లో 3, 2017లో 6, 2018లో 6, 2019లో 5 మొత్తం 43 సెంచరీలు చేశాడు.  2020లో మాత్రం 9 మ్యాచులు ఆడదిన విరాట్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అయితే.. హాఫ్ సెంచరీలు మాత్రం 5 చేశాడు. అందులో రెండుసార్లు 89 స్కోర్లుగా సాధించాడు.

కాగా.. కోహ్లీ సెంచరీలు కొట్టిన ఏడాదిలో తక్కువలో తక్కువ 10, ఎక్కువలో ఎక్కువ 34 వన్డేలు ఆడటం గమనార్హం. ఇక ఆస్ట్రేలియాతో ముగిసిన ఆఖరి వన్డేలో కోహ్లీ మరో రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా 12వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 242 ఇన్సింగ్స్ లో నే ఈ ఘనత సాధించుకున్నాడు. సచిన్(300), రికీ పాంటింగ్(314), అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక సచిన్ 49 సెంచరీల రికార్డుకు కోహ్లీ కేవలం 6 సెంచరీల దూరంలో ఉన్న సంగతి తెలిసిందే.