India Vs New Zealand Tests: ఐసీసీ టోర్నీలలో మనకు అడ్డు తగులుతున్న న్యూజిలాండ్ కు భారత్ లో దారుణమైన రికార్డుంది. 1955లో ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు ప్రారంభమయ్యాయి. అప్పట్నుంచి ఇప్పటివరకు ఇండియా-న్యూజిలాండ్ 60 టెస్టులలో తలపడ్డాయి. కానీ..
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా.. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే మరి ఆ జట్టు భారత్ లో భారత్ ను ఎప్పుడు ఓడించిందో తెలుసా..? సరిగ్గా 33 ఏండ్లు. అవును.. టీమిండియాపై ఆఖరుసారి న్యూజిలాండ్ 1988లో గెలిచింది. భారత్ లో టెస్టు సిరీస్ సాధించడం సంగతి అటుంచితే కనీసం ఒక్క టెస్టు కూడా గెలవడానికి కివీస్ తంటాలు పడుతున్నది.
1955లో ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు ప్రారంభమయ్యాయి. అప్పట్నుంచి ఇప్పటివరకు ఇండియా-న్యూజిలాండ్ 60 టెస్టులలో తలపడ్డాయి. ఇందులో 21 సార్లు భారత్ నెగ్గగా.. 13 సార్లు కివీస్ గెలిచింది. ఏకంగా 26 టెస్టులు డ్రా అయ్యాయి. ఇదిలాఉంటే.. ఇండియాలో ఇంతవరకు ఆ జట్టు టెస్టు సిరీస్ విజయం సాధించలేదు. మొత్తంగా భారత్ లో ఆ జట్టు 34 టెస్టులాడితే గెలిచింది రెండు మ్యాచులు మాత్రమే..
సిరీస్ పక్కనబెడితే.. ఆఖరు సారి న్యూజిలాండ్ 1988 లో ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ పై నెగ్గింది. ఆ తర్వాత ఆ జట్టు ఆరు సార్లు ఇండియా పర్యటనకు వచ్చింది. కానీ ఏ ఒక్క కివీ కెప్టెన్ కూడా భారత్ లో భారత్ ను ఓడించలేదు. ఇక 2012, 2016-17 లలో ఇండియా పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ ను భారత్ చిత్తుగా ఓడించింది. ఆ రెండింటిలోనూ ఇండియా క్లీన్ స్వీపే చేసింది. 1988 నుంచి పలువురు కివీ సారథులు భారీ ఆశలతో రావడం.. వుత్త చేతులతో వెనుదిరగడం ఆనవాయితీగా మారింది. మరి కేన్ మామ ఈసారి కివీస్ తలరాతను మారుస్తాడా..?
ఈ నేపథ్యంలో కివీస్ ఆటగాడు రాస్ టేలర్ మాత్రం ఈసారి టీమిండియాను ఓడిస్తామని అంటున్నాడు. అందుకు అన్ని విధాలా సిద్ధమయ్యే వచ్చామని చెబుతున్నాడు. న్యూజిలాండ్ బోర్డు షేర్ చేసిన ఓ వీడియోలో అతడు మాట్లాడుతూ.. ‘భారత్ లో భారత్ ను ఓడించడం చాలా కష్టం. ఈసారి స్పష్టంగా కొద్దిగా భిన్నంగా సాధన చేస్తున్నాం. నెట్ బౌలర్లు లేకపోవడంతో మా జట్టు బౌలర్లే బంతులు వేస్తున్నారు. స్పిన్నర్లను బాగా ఎదుర్కొంటున్నాం. వాళ్లు కూడా చాలా కష్టపడుతున్నారు’ అని చెప్పాడు.
ఇక్కడ తొలి 10-20 బంతులను ఆడటం చాలా కీలకమని, కుదురుకున్నాక మనకు అన్నీ అనుకూలిస్తాయని టేలర్ వివరించాడు. అయితే భారత స్పిన్నర్లను ఎదుర్కుని నిలవడం చాలా కష్టమనే పనే అయినప్పటికీ భారీ స్కోర్ చేసి తమ బౌలర్లపై ఒత్తిడి తగ్గిస్తామని చెప్పాడు. ప్రపంచ ఛాంపియన్ల హోదాలో వచ్చినా.. ఇంకే రూపంలో వచ్చినా భారత్ లో మాత్రం అండర్ డాగ్సే అని.. స్వదేశంలో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని టేలర్ తెలిపాడు. వాళ్ల (టీమిండియా)కు ఈ పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఉందని, కానీ ఈసారి మాత్రం విజయం సాధించడానికి తాము పక్కా ప్రణాళికతో వచ్చామని చెప్పాడు.
