కరోనా వైరస్‌ ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో తెలియదు. క్రికెట్‌ పోటీలు తిరిగి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. కానీ, క్రికెట్‌ ప్రపంచంలో ఒక చర్చ మాత్రం విస్తృతంగా జరుగుతోంది. అదే..కరోనా వైరస్‌ దరిమిలా ఇకపై బంతికి మెరుపు తెచ్చేందుకు బౌలర్లు ఉమ్మి ఉప యోగించడం ప్రమాదకరమని. అలా అయితే, ప్రత్యామ్నాయం ఏమిటన్న వాదనా తెరపైకి వచ్చింది.

దీనిపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతుండగా.. తాజాగా ఈ విషయంపై ఇండియన్ క్రికెటర్ షమీ స్నందించారు. బంతి షైన్‌ను సరిగ్గా నిర్వహిస్తే లాలాజలం లేకుండా బాల్ రివర్స్ స్వింగ్ సాధ్యమౌతుందని షమీ పేర్కొన్నారు.

తాజాగా.. రోహిత్ జుగ్లాన్ తో షమీ ఇన్ స్టాగ్రామ్ చాట్ లో మాట్లాడాడు. ఈ సందర్బంగా ఈ విషయంపై మాట్లాడాడు. ‘‘ఇబ్బందులు ఉంటాయి. మాకు చిన్నప్పటి నుంచీ లాలాజలం వాడటం అలవాటు.  ఫాస్ట్ బౌలర్లు అందరూ సహజంగానే బంతి మెరిసేందుకు ఉమ్ము పూస్తారు.  అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది కుదరదు కనుక.. బాల్ షైన్‌ను కొనసాగించగలిగితే అది ఖచ్చితంగా రివర్స్ అవుతుంది ”అని  షమీ పేర్కొన్నారు.

కాగా.. ఉమ్మి వేయకుండా తాను ఇప్పటి వరకు బౌలింగ్ చేయలేదని షమీ పేర్కొనడం విశేషం. కానీ ప్రస్తుత కరోనా వైరస్ విలయాతండవం చేస్తున్నందున ఎవరూ ఉమ్మి వాడకపోవడమే మంచిదని సూచించాడు.

ఇదిలా ఉండగా.. ఉమ్మి లేకుండా బాల్ రివర్స్ స్వింగ్ కి ఐసీసీ ప్రత్యామ్నాయాలు యోచిస్తోంది. బంతి మెరుపునకు ఉమ్మి కాకుండా ఆమోదయోగ్యమైన కృత్రిమ పదార్థాలు, ఇతర వస్తువులను అనుమతిస్తే ఎలా ఉంటుందని ఐసీసీ ఆలోచిస్తోంది. 

భారత వెటరన్‌ బౌలర్లు ఆశిష్‌ నెహ్రా, హర్భజన్‌ సింగ్‌ మాత్రం కొద్ది రోజుల క్రితం ఈ విషయం పై స్పందించారు. వారు మాత్రం  బంతికి మెరుపు తెచ్చేందుకు ఉమ్మి పూయడమే ఉత్తమ మార్గమని అంటున్నారు. ‘ఉమ్మి లేదా చెమటతో బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. ఈ రెండింటి తర్వాతే వాస్‌లైన్‌’ అని నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఇక..చక్కెర కలిసి ఉన్నందున ఉమ్మి కంటే చూయింగ్‌ గమ్‌ తడి బంతి మెరుపునకు ఎక్కువగా తోడ్పడుతుందని హర్భజన్‌ చెప్పాడు.