Brendon McCullum: ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్. అయితే తాజా బాధ్యతల నేపథ్యంలో అతడు ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం.
ఐపీఎల్ లో తన మొదటి జట్టు, ప్రస్తుతం అదే జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న బ్రెండన్ మెక్ కల్లమ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు హెడ్ కోచ్ గా నియమితుడైన అతడు.. త్వరలోనే ఆ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఇక అతడు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్నాడని, ఈ సీజన్ ముగిసిన తర్వాత దానిమీద అధికారిక ప్రకటన కూడా వెల్లడించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ తో పోలిస్తే మెక్ కల్లమ్ కు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భారీగా ముట్టజెప్పుతున్నది. దీంతో అతడు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పడానికే నిర్ణయించుకున్నాడట..
గత రెండేండ్లుగా వరుస పరాజయాలతో తీవ్ర విమర్శల పాలైన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ తో పాటు హెడ్ కోచ్ ను కూడా నియమించింది ఈసీబీ. మెక్ కల్లమ్ కు ఏకంగా ఒక మిలియన్ యూఎస్ డాలర్ల (సుమారు 7.7 కోట్లు) జీతం చెల్లించనున్నట్టు సమాచారం.
మెక్ కల్లమ్ కు భారీ జీతం ఆఫర్ చేయడంతో పాటు బోనస్ లు, ఇతర తాయిళాలు కూడా భారీగానే అందించనుంది ఈసీబీ. ఈ ఒప్పందంతోనే బ్రెండన్ ఐపీఎల్ ను వీడి ఇంగ్లాండ్ కోచ్ గా వెళ్లడానికి అంగీకరించాడట. ప్రస్తుతం ఐపీఎల్ లో కేకేఆర్ హెడ్ కోచ్ గా మెక్ కల్లమ్ కు వచ్చే దానికంటే దబుల్ సాలరీ ఈసీబీ ఇవ్వజూపింది.
జీతమెంత..?
ఐపీఎల్ లో కేకేఆర్ కు హెడ్ కోచ్ గా (రెండు నెలలు) పనిచేస్తే ఆ జట్టు యాజమాన్యం మెక్ కల్లమ్ కు రూ. 3.4 కోట్లు (ఇది 2021 లెక్కే..) చెల్లిస్తున్నది. కానీ ఈసీబీ మాత్రం రూ. 7.7 కోట్ల వార్షిక వేతనంతో పాటు ఇతర తాయిళాలు కూడా అందజూపుతున్నది.
కొనసాగుతాడా..?
ఇంగ్లాండ్ కోచ్ గా నియమితుడయ్యాక బ్రెండన్.. కేకేఆర్ కు, ఐపీఎల్ కు గుడ్ బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అతడు ఇంగ్లాండ్ కోచ్ గా ఎంపికయ్యాక మళ్లీ ఐపీఎల్ లో కోచింగ్ చేయడానికి ఈసీబీ అంగీకరించే ఆస్కారమే లేదు. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు అంతర్జాతీయ సిరీస్ లను నిర్వహించకపోయినా ఇక్కడి జట్లకు కోచ్ గా ఉండేందుకు ఆయా జట్లు అంగీకారం తెలపవు. ఇలా చూస్తే మెక్ కల్లమ్ ఐపీఎల్ కు దూరమైనట్టే..
యాజమాన్యం కూడా అదే ఆలోచనలో..
మెక్ కల్లమ్ పనితీరు పట్ల కేకేఆర్ యాజమాన్యం కూడా సంతృప్తిగా లేదని టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ లో 12 మ్యాచులాడిన ఆ జట్టు ఐదు మ్యాచుల్లోనే గెలిచింది. ఏడింట్లో ఓడింది. ఈ సీజన్ లో ఆ జట్టు ప్లేఆఫ్స్ కు వెళ్లడం అసంభవమే. అదీగాక జట్టులో సమన్వయ లోపం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కోచ్ గా జట్టును సమన్వయపరచడంలో మెక్ కల్లమ్ విఫలమైనట్టు కేకేఆర్ యాజమాన్యం భావిస్తున్నది. ఒకవేళ అతడు వెళ్లినా వదిలేయడానికే సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ సీజన్ ముగిశాక దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
