టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ పట్టుకుని ఏడాది కావొస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న ధోని ఐపీఎల్ మెరుపులు మెరిపిస్తాడని అంతా భావించారు.

అయితే కరోనా నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడటంతో ధోని అభిమానులు నిరాశకు లోనయ్యారు. అయితే ఒకవేళ ఐపీఎల్ జరగకుంటే ధోని తిరిగి టీమిండియాలోకి తిరిగి వచ్చే అవకాశాలు సన్నగిల్లాయని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్.

స్టార్‌ స్పోర్ట్స్‌లో క్రికెట్ కనెక్టెడ్ ఛాట్‌లో పాల్గొన్న గౌతీ.. ధోనీ తర్వాత జట్టు కీపర్‌గా కేఎల్ రాహులే సరైన ఆటగాడిగా అభిప్రాయపడ్డాడు. ఈసారి ఐపీఎల్ జరగకపోతే భారత జట్టులోకి ధోనిని ఏ విధంగా ఎంపిక చేస్తారని గంభీర్ ప్రశ్నించాడు.

వన్డేల్లో రాహుల్‌ బ్యాటింగ్, కీపింగ్ సామర్ధ్యాలను తాను చూస్తున్నానని.. ధోనిలా కీపింగ్ చేయకపోయినా, టీ20 క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకుని చూస్తే అతనికి సరైన వారసుడు కేఎల్ రాహులేనని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

కీపింగ్ బాధ్యతలు చూసుకుంటూనే అవసరమైతే మూడు, నాలుగు స్థానాల్లో రాహుల్ బ్యాటింగ్ చేయగలడని గౌతమ్ వివరించాడు. ఇదే సమయంలో టీమిండియాపై స్పందిస్తూ.. అత్యుత్తమ ప్రదర్శన చేసే వాళ్లనే జట్టులోకి తీసుకోవాలని అనుకుంటుందుని చెప్పాడు.

భారత జట్టుకు ఎవరు ఆడినా అంతిమంగా విజయాలు సాధించాలని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ధోని రిటైర్మెంట్‌పై స్పందిస్తూ.. అది అతని వ్యక్తిగత నిర్ణయమని తేల్చేశాడు.