Cricket South Africa: ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా తొలి రెండు మ్యాచులను నెగ్గి తర్వాత రెండింటిలో ఓడింది. త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న ఆ జట్టుకు కొత్త సారథులు వచ్చారు. 

త్వరలో ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు వెళ్లనున్న దక్షిణాఫ్రికా కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పరిమిత ఓవర్ల సారథి టెంబ బవుమా కెప్టెన్సీ పదవితో పాటు జట్టుకు కూడా దూరమయ్యాడు. చేతికి గాయం కావడంతో అతడు ఈ రెండు పర్యటనలకు దూరంగా ఉండనున్నాడు. దీంతో సఫారీ క్రికెట్ జట్టు.. రెండు ఫార్మాట్లకు ఇద్దరు కొత్త కెప్టెన్లకు ప్రకటించింది. వన్డేలలో బవుమా స్థానాన్ని భారత సంతతికి చెందిన కేశవ్ మహారాజ్ భర్తీ చేయనుండగా.. టీ20లలో డేవిడ్ మిల్లర్ సారథ్య బాధ్యతలు మోయనున్నాడు. ఈ మేరకు క్రికెట్ సౌతాఫ్రికా ఓ ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించింది. మూడు ఫార్మాట్లకు జట్టును కూడా ప్రకటించింది. 

ఈ నెల 19 న ఇంగ్లాండ్ కు వెళ్లనున్న సౌతాఫ్రికా.. అక్కడ దాదాపు రెండు నెలల పాటు ఉండనుంది. ఈ పర్యటనలో సఫారీలు.. ఇంగ్లాండ్ తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అవి ముగిశాక ఐర్లాండ్ తో రెండు టీ20 లు కూడా ఆడుతుంది. ఆ తర్వాత మళ్లీ ఇంగ్లాండ్ కు వచ్చి ఇంగ్లీష్ జట్టుతో మూడు టెస్టులు ఆడనుంది. 

అయితే దక్షిణాఫ్రికా కు పరిమిత ఓవర్ల క్రికెట్ లో సారథిగా ఉన్న బవుమా.. ఇటీవలే భారత్ తో ఆడిన రాజ్కోట్ లో ఆడిన నాలుగో టీ20 మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగి తర్వాత కూడా బ్యాటింగ్ కు రాలేదు. కాగా.. దక్షిణాఫ్రికాకు వెళ్లగానే అతడిని పరీక్షించగా బవుమా కు శస్త్ర చికిత్స చేయాలని.. అతడికి రెండు నెలల పాటు విరామం కావాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ జట్టు కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్ లను సారథులుగా నియమించింది. 

ఇంగ్లాండ్ జట్టు.. భారత్ తో పరిమిత ఓవర్ల మ్యాచులు (జులై 17) ముగియగానే సఫారీలతో పోటీకి దిగనుంది. జులై 7 నుంచి 17 వరకు భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 లు ఆడనుంది. 

సఫారీల యూకే పర్యటన ఇలా..

- జులై 19 : ఇంగ్లాండ్ తో తొలి వన్డే 
- జులై 22 : రెండో వన్డే 
- జులై 24 : మూడో వన్డే 
- జులై 27 : తొలి టీ20 
- జులై 28 : రెండో టీ20 
- జులై 31 : మూడో టీ20 
-ఆగస్టు 3 : ఐర్లాండ్ తో తొలి టీ20 
- ఆగస్టు 5 : రెండో టీ20 
- ఆగస్టు 17-21 : ఇంగ్లాండ్ తో తొలి టెస్టు 
- ఆగస్టు 25-29 : రెండో టెస్టు 
- సెప్టెంబర్ 8-12 : మూడో టెస్టు

Scroll to load tweet…