Asianet News TeluguAsianet News Telugu

Tim Paine: యాషెస్ కు ముందు ఆసీస్ కు భారీ దెబ్బ.. టిమ్ పైన్ రాజీనామా.. తర్వాత సారథి ఎవరు..?

Australia Cricket: 2017లో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించి.. క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టగా.. అందులో పైన్ సదరు మహిళకు అసభ్యకర రీతిలో తన ఫోటోతో పాటు పలు అసహ్యకర  సందేశాలు కూడా పంపాడని విచారణలో తేలింది. 

Big blow To Cricket Australia, Ahead of Ashes Series Aussie Skipper Tim Paine resigns From captaincy after Sexting Scandal
Author
Hyderabad, First Published Nov 19, 2021, 12:04 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కు మూడు వారాల  ముందు ఆస్ట్రేలియా క్రికెట్ కు ఊహించని ఎదురుదెబ్బ. టీ20 ప్రపంచకప్ గెలిచి జోరు మీదున్న కంగారూలకు భారీ  షాక్ తగిలింది. తనతో పనిచేస్తున్న మహిళకు అభ్యంతరకరమైన రీతిలో అసభ్యకర సందేశాలు పంపిన నేపథ్యంలో ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథి టిమ్ పైన్ తన సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2017లో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించి.. క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టగా.. అందులో పైన్ సదరు మహిళకు అసభ్యకర రీతిలో తన ఫోటోతో పాటు పలు అసహ్యకర  సందేశాలు కూడా పంపాడని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో పైన్ ఆ పదవికి రాజీనామా చేశాడు. డిసెంబర్ 8 నుంచి కీలక యాషెస్ సిరీస్ మొదలుకానున్న తరుణంలో పైన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం కంగారూలకు కోలుకోలేని దెబ్బే.. 

అసలేం జరిగింది..? 

2017లో తన తో పని చేస్తున్న ఓ మహిళకు పైన్ అసభ్యకరమైన రీతిలో సందేశాలు పంపాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. అసభ్యకర రీతిలో ఉన్న తన ఫోటోతో పాటు వార్తలో రాయలేని విధంగా సందేశాలు పంపించాడు. ఇందుకు సంబంధించి సదరు మహిళ క్రికెట్ ఆస్ట్రేలియా కు ఫిర్యాదు చేసింది. దీనిపై సీఏ విచారణ చేపట్టింది. పైన్  ను కూడా విచారించింది. ఇద్దరి వాదనలు విన్న బోర్డు.. పైన్ పై చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన అతడు.. తాను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సారథిగా ఉండటానికి అనర్హుడినంటూ  తెలిపాడు. 

పైన్ ఏం చెప్పాడు..? 

‘ఇది చాలా కష్టతరమైన నిర్ణయం (కెప్టెన్సీ నుంచి వైదొలగడం). కానీ నాకు,  నా కుటుంబానికి, ఆస్ట్రేలియా జట్టుకు ఇదే మంచిది.  నేను క్రికెట్ ఆస్ట్రేలియా జరిపిన విచారణ లో పాల్గొన్నాను. అందుకు పూర్తిగా సహకరించాను. అయితే బోర్డు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలను మాత్రం నేను ఉల్లంఘించలేదు. ఇక ఈ ఘటనపై నేను పశ్చాత్తాపపడుతున్నాను. నేను చేసిన పనికి చింతిస్తున్నాను. నా భార్య, కుటుంబాన్ని క్షమాపణలు కోరాను. ఆసీస్ కెప్టెన్ గా ఉండటానిని నేను అనర్హుడను..’ అని పైన్ తెలిపాడు. 

 

ఇప్పటి ముచ్చట కాదు.. గతం నుంచీ ఇదే కథ

ఆస్ట్రేలియా క్రికెటర్లంటేనే తుంటరికి  మారుపేరు. ఫీల్డ్ లో ఆటగాళ్లను రెచ్చగొట్టడం నుంచి మొదలు పలు వివాదాలకు వాళ్లు కేంద్ర బింధువులన్న సంగతి క్రికెట్ ప్రపంచానికి తెలిసిందే.  ప్రపంచ అగ్రశ్రేణి స్పిన్నర్ షేన్ వార్న్ కూడా లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇక మూడేండ్ల క్రితం అప్పటకి ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కకుని కెప్టెన్సీ తో పాటు ఏడాది పాటు నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నాడు. 2018లో స్టీవ్ స్మిత్ నుంచి ఆసీస్ టెస్టు జట్టు పగ్గాలందుకున్న పైన్ కూడా వివాదంలో కూరుకుపోయి సారథ్య పగ్గాలు వదులకోవడం గమనార్హం. 

నెక్ట్స్ ఎవరు..? 

పైన్ రాజీనామా నేపథ్యంలో కొత్త సారథి ఎవరన్న దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా తర్జన భర్జన పడుతున్నది. ఇంగ్లాండ్ తో త్వరలో మొదలయ్యే యాషెస్ సిరీస్ లో భాగంగా  తొలి  రెండు టెస్టుల కోసం ఆస్ట్రేలియా ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టిమ్ పైన్ సారథి కాగా.. ఆసీస్ ఫాస్ట్ బౌలర్  పాట్ కమిన్స్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే ఇప్పుడ అతడినే సారథిగా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కమిన్స్  తో పాటు రేసులో లబూషేన్, మాజీ సారథి స్టీవ్ స్మిత్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై నేడో, రేపో తుది నిర్ణయం  వెలువడే అవకాశముంది. 

అతడిని చేస్తే చరిత్రే.. 

లబూషేన్, స్మిత్ ను కాకుండా కమిన్స్ కు ఆసీస్ సారథ్య బాధ్యతలు అప్పజెప్పితే అది చరిత్రే కానుంది. ఎందుకంటే 1964 తర్వాత నుంచి ఆసీస్ కు  ఒక బౌలర్ ఆ జట్టుకు కెప్టెన్సీ చేపట్టలేదు. 1964లో చివరిసారిగా కంగారూ  బౌలర్ రిచి బెనాడ్..  ఆసీస్ కు నాయకుడిగా నడిపించాడు. ఆ తర్వాత కెప్టెన్లంతా బ్యాటర్లే. కాగా.. ఇటీవలే తనను వైస్ కెప్టెన్ గా నియమించడం పై కమిన్స్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  వైస్ కెప్టెన్ గా తనను నియమించినందుకు సంతోషంగా ఉందని, అయితే  సారథ్య బాధ్యతలు చేపట్టే సత్తా కూడా తనకు ఉందని, ఒకవేళ కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పితే ఆసీస్ ను సమర్థవంతంగా నడిపిస్తానని వ్యాఖ్యానించాడు. మరి  క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు ఎవరివైపు మొగ్గు చూపుతారో  చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios