Asianet News TeluguAsianet News Telugu

ఇది షార్ట్ రన్ కాదు, అంతకుమించి... సగం క్రీజు నుంచే వెనక్కి వెళ్లిన బ్యాట్స్‌మెన్... అంపైర్లు ఏం చేశారంటే...

స్ట్రైయిక్ అట్టిపెట్టుకోవడం కోసం క్రీజు మధ్యలో నుంచే వెనక్కి వెళ్లిన బ్యాట్స్‌మెన్... కావాలని షార్ట్ రన్ తీసినందుకు 5 పరుగుల పెనాల్టీ విధించిన అంపైర్లు... బిగ్‌బాష్ లీగ్ 2021 సీజన్‌లో సంఘటన...

 

 

Big Bash League 2021: Umpire cut-offs 5 Runs as a Penalty, after batsman wontedly runs a Short run
Author
India, First Published Dec 24, 2021, 2:01 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ తీసిన షార్ట్ రన్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఓ రకంగా అప్పటిదాకా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్‌, కెప్టెన్సీ కోల్పోయి, జట్టుకి దూరమై...ఇప్పుడు ఏకంగా ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌ను వీడడానికే కారణమైంది సదరు షార్ట్ రన్... ఇప్పుడు అలాంటి సంఘటనే బిగ్‌బాష్ లీగ్‌లో జరిగింది...

సాధారణంగా షార్ట్ రన్ అంటే, లైన్ దగ్గరి దాకా వచ్చి బ్యాట్‌ నేలకు తాకించడంలో పొరపాటు చేయడం లేదా, బ్యాటు లైన్ దాటకపోయినా, ఫీల్డర్ వైపు చూస్తూ దాటి ఉంటుందని అనుకుని, వెనక్కి వెళ్లడం జరుగుతుంటాయి. అయితే బిగ్‌బాష్ లీగ్‌లో అలా కాదు, క్రీజు సగం మధ్యలో నుంచే వెనక్కి వెళ్లాడు సదరు బ్యాట్స్‌మెన్... దీంతో ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీశాడని, ఆ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించారు అంపైర్లు...

బిగ్‌బాష్ లీగ్ 2021 సీజన్‌లో భాగంగా హోబర్ట్ హరికేన్స్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిందీ సంఘటన. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హోబర్ట్ హరికేన్స్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. 

హరికేన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో మూడో బంతికి టిమ్ డేవిడ్ ఆడిన బంతికి రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించాడు. అయితే ఫీల్డర్‌ను చూస్తూ పరుగెత్తిన డేవిడ్, క్రీజు సగం మధ్యలో నుంచే వెనక్కి వెచ్చేశాడు. 

నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో నాథన్ ఎల్లీస్ ఉండడంతో అతనికి స్ట్రైయికింగ్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా షార్ట్ రన్‌ తీశాడు టిమ్ డేవిడ్. ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీసినట్టు నిర్ధారణ కావడంతో హోబర్డ్ హరికేన్స్ జట్టుకి 5 పరుగుల పెనాల్టీగా కోత విధించారు అంపైర్లు...

12 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 22 పరుగులు చేసిన టిమ్ డేవిడ్ నాటౌట్‌గా నిలవగా ఓపెనర్లు బెన్ మెక్‌డెర్మాట్ 67, మాథ్యూ వేడ్ 39, ఆర్క్ షార్ట్ 26 పరుగులు చేయడంతో 180 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది హోబర్ట్ హరికేన్స్...

181 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన మెల్‌బోర్న్ స్టార్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. మార్కస్ స్టోయినిస్ 18 పరుగులు చేయగా వికెట్ కీపర్ జో క్లర్క్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 12 పరుగులు చేయయగా, ఆండ్రే రస్సెల్ 12, జో బర్న్స్ 22, హిల్టన్ కార్ట్‌వ్రైట్ 26 పరుగులు చేశారు. దీంతో 24 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది హోబర్ట్ హరికేన్స్. 

హోబర్ట్ హరికేన్స్‌కి ఇది ఐదు మ్యాచుల్లో రెండో విజయం కాగా, మెల్‌బోర్న్ స్టార్స్‌కి ఐదు మ్యాచుల్లో మూడో పరాజయం. అయితే మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా హరికేన్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంటే, మెల్‌బోర్న్ స్టార్స్ ఏడో స్థానంలో ఉంది. పెర్త్ స్కోర్చర్స్ ఐదింట్లో ఐదు విజయాలతో టాప్‌లో ఉండగా, నాలుగు విజయాలతో సిడ్నీ సిక్సర్‌లో టాప్ 2లో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios