Asianet News TeluguAsianet News Telugu

భారత జట్టులోకి తెలంగాణ అమ్మాయి.. మిథాలీ వారసురాలిగా త్రిషా..

Trisha Gongadi: భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టు  త్వరలోనే న్యూజిలాండ్ తో  ఆడనుంది.  ఐదు మ్యాచ్ ల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో తెలంగాణ  యువ క్రికెటర్, భద్రాద్రికి చెందిన త్రిషా కూడా ఎంపికైంది. 

Bhadradri Student Trisha Features in  India's Under-19 Squad, Know About Her
Author
First Published Nov 21, 2022, 11:30 AM IST

త్వరలో భారత పర్యటనకు రానున్న న్యూజిలాండ్ అండర్-19 మహిళల క్రికెట్ జట్టు భారత్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది.  ఈ  సిరీస్ లో  పాల్గొనబోయే అండర్ - 19 భారత మహిళల జట్టును  బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టులో   తెలంగాణకు చెందిన అమ్మాయి గొంగడి త్రిషా చోటు దక్కించుకుంది.  భద్రాచలం  త్రిషా సొంత ఊరు.  ఆల్ రౌండర్ గా  జట్టులో చోటు దక్కించుకున్న త్రిషా గురించిన ఆసక్తికర విషయాలివిగో.. 

ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న త్రిషాకు చిన్నప్పట్నుంచే క్రికెట్ అంటే ఇష్టం. ఎనిమిదేండ్ల వయసులోనే ఆమె క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది.  మూడో తరగతిలో ఉండగానే   క్రికెట్  పాఠాలు నేర్చుకుంది. 

త్రిషా తండ్రి  భద్రాచలంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఫిట్మెంట్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు.  తన కూతురులోని టాలెంట్ ను గుర్తించిన   త్రిషా తండ్రి రామిరెడ్డి..  ఆమెను   ప్రోత్సహించాడు.   12 ఏండ్ల వయసులోనే ఆమె  బీసీసీఐ నిర్వహించిన పలు టోర్నీలలో  పాల్గొంది.   బీసీసీఐ నిర్వహించిన  మహిళల అండర్ - 19  ఛాలెంజర్ ట్రోఫీలో ఇండియా బి తరఫున ఆమె పాల్గొని రాణించింది. ఈ ట్రోఫీలో  ఆమెకు  ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది.  

ఇండియా అండర్ - 19 జట్టుకు ఎంపిక కావడం గురించి త్రిషా మాట్లాడుతూ..  తనకు చిన్నప్పట్నుంచి ఎంఎస్ ధోని, మిథాలీ రాజ్ ల ఆట అంటే ఎంతో ఇష్టమని వాళ్లను ఆరాధిస్తానని  తెలిపింది.  వాళ్లిద్దరినీ చూసి తన బ్యాటింగ్ లో మార్పులను చేసుకున్నదని చెప్పింది.  

త్రిషా ఆసక్తిని గమనించిన తండ్రి రామిరెడ్డి.. భద్రాచలంలో ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ కు షిప్ట్ అయ్యాడు. దీంతో ఆమె ఇక్కడ  క్రికెట్ ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది. మిథాలీ రాజ్ బాటలో సబ్బినేని మేఘన, అరుంధతి రెడ్డిల తర్వాత మరో తెలుగమ్మాయి  జాతీయ జట్టులోకి వెళ్తుండటం గమనార్హం. 

 

న్యూజిలాండ్ అండర్ -19 మహిళల క్రికెట్ జట్టు ఈనెల 27 నుంచి భారత్ తో ఐదు మ్యాచ్ ల టీ20  సిరీస్ ఆడనున్నది. ఈ మేరకు  ఆలిండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ఇండియా అండర్-19 జట్టును ప్రకటించింది. శ్వేతా సెహ్రావత్ సారథిగా ఉన్న ఈ జట్టుకు  సౌమ్య తివారి వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది.  

ఇండియా అండర్ - 19 జట్టు : శ్వేతా సెహ్రావత్ (కెప్టెన్), శిఖా షలోట్, త్రిషా.జి, సౌమ్యా తివారి, సోనియా మెహ్దియా, హర్లీ గల, హృషితా బసు (వికెట్ కీపర్), నందిని కశ్యప్ (వికెట్ కీపర్), సోనమ్ యాదవ్,  మన్నత్ కశ్యప్, అర్చనా దేవి, ప్రశవి చోప్రా, టిటాస్ సధు, పలక్ నాజ్, ఎండీ షబ్నమ్ 

ఇండియా, న్యూజిలాండ్ సిరీస్ షెడ్యూల్ :  

- నవంబర్ 27 : తొలి  టీ20
- నవంబర్ 29 : రెండో టీ20 
- డిసెంబర్ 01 : మూడో టీ20 
- డిసెంబర్ 04 : నాలుగో టీ20 
- డిసెంబర్ 06 : ఐదో టీ20 
- మ్యాచ్ లన్నీ ముంబైలోని ఎంసీఎ బీకేసీ  స్టేడియంలో జరుగుతాయి. 

ఈ సిరీస్ కంటే ముందే న్యూజిలాండ్ అండర్-19 జట్టు..  వెస్టిండీస్ అండర్ - 19 జట్టుతో రెండు టీ20లు ఆడనుంది. 

నవంబర్ 22న తొలి టీ20, 24న  రెండో టీ20 ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో  ఈ మ్యాచ్ లు జరుగుతాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios