IndvsAus Indore Test: స్వదేశంలో భారత్ ను ఓడించాలనే లక్ష్యంతో ఇండియాకు వచ్చిన ఆస్ట్రేలియా ఇప్పటికే ఆ అవకాశాన్ని కోల్పోయింది. తాజాగా ఆ జట్టుకు మరో షాక్ తాకింది.
2004 తర్వాత స్వదేశంలో భారత్ ను ఓడించేందుకు నానా తంటాలు పడుతున్న ఆస్ట్రేలియా ఈసారైనా ఆ కోరిక నెరవేర్చుకోవాలనే భారీ లక్ష్యంతో భారత్ లోకి అడుగుపెట్టింది. కానీ ఫలితం మాత్రం ఆసీస్ లక్ష్యాలకు విరుద్ధంగా వస్తున్నది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)- 2023లో భాగంగా ఇదివరకే ముగిసిన రెండు టెస్టులలో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. మరో మ్యాచ్ ఓడితే ఆ జట్టు అధికారికంగా సిరీస్ ను కోల్పోయినట్టే. ఇదిలాఉండగా ఇప్పటికే షాకులలో ఉన్న ఆసీస్ కు మరో భారీ షాక్. మూడో టెస్టుకు ఆ జట్టు సారథి పాట్ కమిన్స్ అందుబాటులో ఉండటం లేదు.
ఢిల్లీ టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగియడంతో కమిన్స్ ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే. తన తల్లి అనారోగ్యం బారీన పడటంతో కమిన్స్.. ఉన్నఫళంగా సిడ్నీ బయల్దేరాడు. మూడో టెస్టు వరకు అతడు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భావించింది.
కానీ తాజా రిపోర్టుల ప్రకారం ఇండోర్ లో మార్చి 1 నుంచి జరుగబోయే మూడో టెస్టుకు కమిన్స్ అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యక్ష ప్రసారాలను వెల్లడించే క్రికెట్.కామ్.ఏయూ వెల్లడించింది. మూడో టెస్టుకు కమిన్స్ అందుబాటులో ఉండడని, వ్యక్తిగత కారణాల వల్ల అతడు మరికొన్నాళ్లు సిడ్నీలోనే ఉండనున్నాడని తెలిపింది.
కమిన్స్ గైర్హాజరీలో ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్.. ఆ జట్టును నడిపించనున్నాడు. ఇండోర్ లో అతడు ఆసీస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. రెండో టెస్టు ముగిశాక దుబాయ్ లో ఉన్న తన భార్యను కలిసేందుకు వెళ్లిన స్మిత్ కు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయం తెలియజేయడంతో అతడు తిరిగి జట్టుతో కలిశాడు. అయితే కమిన్స్.. మూడో టెస్టుతో పాటు అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే నాలుగో టెస్టులో కూడా అందుబాటులో ఉండేది అనుమానమేనని ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
దక్షిణాఫ్రికా లో బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన స్మిత్.. 2021లో తిరిగి వైస్ కెప్టెన్ గా నియమితుడైన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్మిత్.. ఆసీస్ జట్టుకు మూడోసారి తాత్కాలిక సారథిగా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే గాయాల కారణంగా జోష్ హెజిల్వుడ్, డేవిడ్ వార్నర్, ఆస్టన్ అగర్ లు మొత్తం సిరీస్ కు దూరమైన విషయం విదితమే.
కాగా ఇండియాతో ఆస్ట్రేలియా ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి ఐదు వరకు మూడో టెస్టు ఆడుతుంది. నాలుగో టెస్టు అహ్మదాబాద్ లో మార్చి 9 నుంచి 13 వరకు మొదలుకానుంది. ఈ రెండు టెస్టులకు కమిన్స్ దూరంగా ఉంటే స్మిత్ సారథిగా ఉంటాడు. అయితే వన్డే సిరీస్ (మార్చి 17 నుంచి) కు మాత్రం కమిన్స్ అందుబాటులో ఉంటాడు.
