INDvsAUS 2023: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా   భారత్ - ఆస్ట్రేలియా మధ్య  జరుగుతున్న  నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ముగిశాయి.  ఈ వేదికలకు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. 

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)- 2023 లో పిచ్ ల గురించి జరుగుతున్న చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది. ఇదివరకే ఈ సిరీస్ లో రెండు టెస్టులు ముగియగా ఆ రెండు మ్యాచ్ లూ మూడు రోజుల్లోనే ముగిశాయి. పిచ్ ల మీద ఆస్ట్రేలియా మీడియా, మాజీలు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. తాజాగా వీరికి ఐసీసీ ప్రకటన మరింత జోష్‌నిచ్చేలా ఉంది. బీజీటీలో ఇదివరకు జరిగిన నాగ్‌పూర్, ఢిల్లీ పిచ్ లకు ఐసీసీ ‘యావరేజ్’ రేటింగ్ ఇచ్చింది. ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) ఈ రేటింగ్ ఇచ్చారు. 

బీజీటీ - 2023లో భాగంగా తొలి టెస్టు నాగ్‌పూర్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 177 పరుగులకే ఆలౌట్ అయింది. బదులుగా భారత్ 400 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్.. 91 పరుగులకే కుప్పకూలింది. 

ఇక రెండో టెస్టు ఢిల్లీలో జరిగింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 262 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి టెస్టుతో పోల్చితే కాస్త బెటర్ గానే ఆడింది ఆసీస్. భారత్ ను ఫస్ట్ ఇన్నింగ్స్ లో 263 పరుగులకు నిలువరించింది. కానీ రెండో ఇన్నింగ్స్ లో మళ్లీ అంతా రివర్స్. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆసీస్.. 113 పరుగులకే కుప్పకూలింది. లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 

ఈ రెండు టెస్టులలోనూ స్పిన్నర్లు జోరు చూపించారు. భారత స్పిన్ ద్వయం అశ్విన్ - జడేజాల ధాటికి ఆసీస్ బ్యాటర్లు విలవిల్లాడారు. ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్ లు ఆడిన ఆసీస్.. రెండంటే రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు తరఫున రెండో టెస్టులో ఖవాజా (81), పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (72) లు మాత్రమే హాఫ్ సెంచరీలు చేశారు. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లు అయిన లబూషేన్, స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ లు దారుణంగా విఫలమయ్యారు. 

ఆస్ట్రేలియా బ్యాటర్లే కాదు.. ఇండియా బ్యాటర్లు కూడా ఈ సిరీస్ లో వైఫల్యాలు సాగిస్తున్నారు. తొలి టెస్టులో రోహిత్ సెంచరీ చేశాడు. స్పిన్ ఆల్ రౌండర్లు జడేజా, అక్షర్ లు రాణించారు. రెండో టెస్టులో వీరికి అశ్విన్ జతకలిశాడు. ఆసీస్ స్పిన్నర్లు టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్ లు కూడా స్పిన్ పిచ్ లపై భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. 

Scroll to load tweet…

విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (నాగ్‌పూర్), అరుణ్‌జైట్లీ స్టేడియం (ఢిల్లీ) లకు ‘యావరేజ్’ రేటింగ్ రావడంతో ఆసీస్ మాజీలకు ఆశాకిరణం దొరికినట్టైంది. తమ బ్యాటర్లు విఫలమయ్యారని పలువురు ఆసీస్ మాజీలు దుమ్మెత్తిపోస్తుంటే ఇయాన్ హీలి వంటి క్రికెటర్లు మాత్రం పిచ్ ల మీదే నిందలు వేస్తున్నారు. రెండో టెస్టులో రివర్స్ స్వీప్స్ ఆడి మూల్యం చెల్లించుకున్న కంగారూలపై ఆ దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా ఐసీసీ ప్రకటన ఆసీస్ మాజీలకు కాస్త బూస్ట్ నిచ్చేదే. 

ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా జరుగుతుంది. ఇప్పటికే నాలుగు టెస్టుల ఈ సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచిన భారత్.. ఇండోర్ లో కూడా కంగారూలను కంగారెత్తించి సిరీస్ ను పట్టేయాలని భావిస్తున్నది. మరి రెండు టెస్టులలోనూ దెబ్బతిన్న ఆస్ట్రేలియా మూడో టెస్టులో అయినా పుంజుకుంటుందా..? అన్నది వేచి చూడాల్సిందే.