WPL 2023: గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బెత్ మూనీ... సౌతాఫ్రికా ఓపెనర్ లారాకి అవకాశం..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ టీమ్‌కి భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెనర్, గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బెత్ మూనీ, గాయంతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ మొత్తానికి దూరమైంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బెత్ మూనీ మోకాలికి గాయమైంది.
ఈ గాయం పూర్తి కోలుకునేందుకు కనీసం ఆరు వారాల సమయం పడుతుందని తేల్చారు వైద్యులు. దీంతో ఆమె స్వదేశానికి పయనం కానుంది. తొలి మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ బెత్ మూనీ, ఆ తర్వాత రెండు మ్యాచుల్లోనూ ఆడలేదు. ఈ రెండు మ్యాచ్‌లకు వైస్ కెప్టెన్ స్నేహ్ రాణా కెప్టెన్సీ చేసింది.
యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పోరాడి ఓడిన గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో గెలిచి 2023 సీజన్‌లో తొలి విజయం అందుకుంది...
‘గుజరాత్ జెయింట్స్ తరుపున మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ సీజన్ ఆడేందుకు చాలా ఆతృతగా ఇక్కడికి వచ్చాను. అయితే గాయం కారణంగా మిగిలిన మ్యాచులను ఆడలేకపోతున్నా. ఆటలో గాయాలు సర్వ సాధారణం. నేను టీమ్‌కి దూరంగా ఉన్నా, ప్రతీ మ్యాచ్‌ని చూస్తూనే ఉంటాను...
ఫీల్డ్‌కి, మిగిలిన సీజన్‌కి అందుబాటులో లేకపోయినా వచ్చే సీజన్‌లో తిరిగి ఈ అద్భుతమైన టీమ్ తరుపున ఆడేందుకు ఎదురుచూస్తుంటా... అదానీ గుజరాత్ జెయింట్స్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్...’ అంటూ రాసుకొచ్చింది బెత్ మూనీ...
బెత్ మూనీ సీజన్ మొత్తానికి దూరం కావడంతో మిగిలిన సీజన్‌కి వైస్ కెప్టెన్ స్నేహ్ రాణానే కెప్టెన్సీ చేయనుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌కి హర్మన్‌ప్రీత్ కౌర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి స్మృతి మంధాన కెప్టెన్లుగా ఉన్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మూడో స్వదేశీ కెప్టెన్‌గా నిలవనుంది ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా...
గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన బెత్ మూనీ స్థానంలో సౌతాఫ్రికా ఓపెనర్ లారా వోల్‌వార్ట్‌ని రిప్లేస్‌మెంట్‌గా తీసుకుంది గుజరాత్ జెయింట్స్ టీమ్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 వేలంలో అమ్ముడుపోని ఈ సొట్ట బుగ్గల చిన్నది, బెత్ మూనీ ప్లేస్‌లో ఆడేందుకు ఇండియాకి రానుంది.
‘ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. గుజరాత్ జెయింట్స్ టీమ్‌తో కలిసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా... ఎప్పుడెప్పుడు ఇండియాకి వెళ్తానా? అని ఆతృతగా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా ఓపెనర్ లారా వోల్‌వార్ట్...
మొదటి మూడు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయాన్ని అందుకున్న గుజరాత్ జెయింట్స్, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. జెయింట్స్ తన తర్వాతి మ్యాచ్‌లో మార్చి 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలబడనుంది.
