పసికూనలు కాదు.. కసి మీదున్నాయి.. అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చిన అనామక జట్లు
T20 World Cup 2022: ఒకప్పుడు బంగ్లాదేశ్ భారత్ ను ఓడిస్తేనో.. అఫ్గాన్ సంచలన ప్రదర్శనతో గెలిచినంత పనిచేస్తేనో.. జింబాబ్వే ఆస్ట్రేలియాకు షాకిస్తేనో సంచలనమయ్యేది. కానీ టీ20 ప్రపంచకప్ లో బోలెడన్నీ సంచలనాలు నమోదయ్యాయి..
మునుపెన్నడూ లేని విధంగా టీ20 ప్రపంచకప్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్.. కనీసం క్వాలిఫై కూడా కాలేదు. సెమీస్ కు రావడం కల్ల అనుకున్న పాకిస్తాన్ సెమీఫైనల్ కు అర్హత సాధించింది. ఇక సెమీస్ కు వెళ్లడమే తరువాయి అనుకున్న దక్షిణాఫ్రికా.. భారమైన గుండెతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసియా ఛాంపియన్లుగా ఉన్న శ్రీలంక.. అతి కష్టమ్మీద సూపర్-12కు చేరినా ఇక్కడ వేటు తప్పలేదు. వీటన్నింటికీ కారణం ఒక్కటే.. అగ్రశ్రేణి జట్లకు షాకులు తగలడమే..
ఒకప్పుడు బంగ్లాదేశ్ భారత్ ను ఓడిస్తేనో.. అఫ్గాన్ సంచలన ప్రదర్శన చేస్తేనో.. జింబాబ్వే ఆస్ట్రేలియాకు షాకిస్తేనో సంచలనమయ్యేది. కానీ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో అటువంటి వింతలు విశేషాలు బోలెడన్నీ జరిగాయి. పసికూనలు అనుకున్న జట్లు అగ్రశ్రేణి జట్లకు కోలుకోలేని షాకులు ఇచ్చాయి.
ఆ జాబితాను ఓసారి పరిశీలిస్తే..
- ఈ ప్రపంచకప్ లో క్వాలిఫైయర్ రౌండ్ తొలి మ్యాచ్ లోనే సంచలనం నమోదైంది. శ్రీలంక - నమీబియా మధ్య ముగిసిన మ్యాచ్ లో లంకను నమీబియాఓడించింది. ఈ మ్యాచ్ లో నమీబియా.. 55 పరుగుల తేడాతో లంకపై గెలిచింది.
- రెండు సార్లు టీ20 ఛాంపియన్ అయిన వెస్టిండీస్.. తమ తొలి మ్యాచ్ లో స్కాట్లాండ్ చేతిలో దారుణంగా ఓడింది. ఆ తర్వాత ఇదే దశలో ఐర్లాండ్.. వెస్టిండీస్ ను ఓడించి ఆ జట్టును ప్రపంచకప్ లో సూపర్-12 కూడా ఆడకుండా ఇంటికి పంపించింది.
- సూపర్-12లో ఐర్లాండ్.. ఇంగ్లాండ్ కు షాకిచ్చింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతను తేల్చిన ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ ఐదు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది.
- ఇక జింబాబ్వే.. పాకిస్తాన్ తో ముగిసిన సూపర్-12 పోరులో లో స్కోరింగ్ గేమ్ లో అనూహ్య విజయాన్ని అందుకుంది. 130 పరుగులను కాపాడుకునే దశలో జింబాబ్వే.. ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ ఓటమి తర్వాత పాక్ దాదాపు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్టే అనుకున్నారంతా..
- ఇక ఆదివారం సౌతాఫ్రికా - నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో డచ్ జట్టు సఫారీలకు కోలుకోలేని షాకిచ్చింది. దక్షిణాఫ్రికాపై 13 పరుగుల తేడాతో గెలిచి ఆ జట్టుకు ప్రపంచకప్ భాగ్యం లేదన్న విషయాన్ని మరోమారు గుర్తు చేసింది. ఈ విజయంతో నెదర్లాండ్స్ కు ఒరిగిందేమీ లేకున్నా.. సెమీస్ అవకాశాలు లేని పాక్ కు సఫారీలు బూస్ట్ ఇచ్చి వారిని సెమీస్ కు చేర్చారు.
తాజా విజయాలతో ఇక నుంచి ఐసీసీ.. అసోసియేట్ దేశాలు, అనామక జట్లుగా ఉన్న సభ్య దేశాలకు కూడా ద్వైపాక్షిక సిరీస్ లు విరివిగా నిర్వహించాలనే వాదన మొదలైంది. ఎప్పుడూ ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చుట్టే తిరగకుండా కాస్త నెదర్లాండ్స్, జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి జట్లపై కూడా దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.