Ranji Trophy-Bengal Team record: బెంగళూరులో జరుగుతున్న రంజీ క్వార్టర్స్ లో బెంగాల్ జట్టు అదరగొడుతున్నది. జార్ఖండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆ జట్టు లో ఏకంగా 9 మంది బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు.  

దేశవాళీ క్రికెట్ లో బెంగాల్ రంజీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ జట్టుకు చెందిన తొలి 9 మంది ఆటగాళ్లంతా హాఫ్ సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేసి 129 ఏండ్ల రికార్డు బద్దలు కొట్టారు. జార్ఖండ్ తో జరుగుతున్న రంజీ క్వార్టర్స్ లో ఈ అరుదైన రికార్డును సాధించింది బెంగాల్ జట్టు. మ్యాచ్ లో ఏ ఇద్దరో ముగ్గురో హాఫ్ సెంచరీలు చేస్తేనే భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ రోజుల్లో ఏకంగా 9 మంది బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేస్తే ఆ జట్టు ఎన్ని పరుగులు చేసుండాలి..?

773-7. జార్ఖండ్ తో జరుగుతున్న రంజీ క్వార్టర్స్ లో బెంగాల్ రంజీ జట్టు చేసిన పరుగులివి. ఈ మ్యాచ్ లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్లు అభిషేక్ రమణ్ (61), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (65) తో పాటు 9వ బ్యాటర్ దాకా పరుగుల హోరెత్తించారు. 

ఓపెనర్లతో పాటు సుదీప్ ఘరామి (186), ఎ.మజుందార్ (117) బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారి (73), అభిషేక్ పూరెల్ (68), ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ (78) సయన్ మండల్ (53), ఆకాశ్ దీప్ (53) లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా బెంగాల్ భారీ స్కోరు చేసింది. 

Scroll to load tweet…

దీంతో బెంగాల్ రంజీ జట్టు.. దేశవాళీ క్రికెట్ లో 129 ఏండ్ల రికార్డును బద్దలుకొట్టింది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా జట్టు.. ఆక్స్ఫర్డ్-కేంబ్రిడ్బిల మధ్య జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో నమోదైన రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఏ జట్టు లోని తొలి 8 మంది ఆటగాళ్లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. తాజాగా బెంగాల్-జార్ఖండ్ మ్యాచ్ లో ఏకంగా 9 మంది బ్యాటర్లు అర్థ శతకాలు సాధించారు. ఇక ఈ సూపర్ బ్యాటింగ్ తో బెంగాల్ జట్టు.. రంజీ సెమీస్ కు వెళ్లడం లాంఛనమే కానుంది.

Scroll to load tweet…