ప్రపంచకప్‌ సమరం ఎప్పుడు మొదలైనా ఆయా దేశాల మాజీ, ప్రస్తుత క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగడం ఆనవాయితీగా వస్తోంది. హాట్ ఫేవరేట్లు భారత్, ఆసీస్‌, ఇంగ్లాండ్‌ల మధ్య ప్రతీసారి ఇది తప్పదు.

దీంతో తాజా టోర్నీలో సైతం మాటల యుద్ధం తారా స్థాయికి చేరుతుందని అందరూ భావించారు. దీనికి భిన్నంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లాండ్ ఆల్‌ రౌండర్ బెన్‌స్టోక్స్.

వీరిద్దరూ ఏ స్థితిలోనైనా ఆటను తమ వైపుకు తిప్పగల సమర్ధులని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ, స్మిత్‌లు ప్రత్యేక స్థానం సంపాదించి తమదైన ముద్ర వేశారని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు.

వీరిద్దరికి తాను పెద్ద అభిమానినని స్టోక్స్ పేర్కొన్నాడు. వీరిద్దరి ఆటను గమనిస్తే... మిగతా వారికన్నా ఎంతో సులభంగా ఆటను మార్చేస్తారని... వీరి బ్యాటింగ్ శైలి భిన్నమైనా కానీ గెలుపు కోసమే ఆడతారని స్టోక్స్ కొనియాడాడు.

ఇక సొంత జట్టు గురించి వ్యాఖ్యానిస్తూ... గత మూడు, నాలుగేళ్లుగా తమ ఆటతో ప్రపంచకప్‌కు ఫేవరేట్‌గా గుర్తింపు పొందామన్నారు. ప్రపంచ నంబర్ వన్ జట్టంటే అన్ని టోర్నీల్లోనూ ఫేవరేట్‌గానే అడుగు పెడుతుందని స్టోక్స్ అభిప్రాపడ్డాడు.

ఆస్ట్రేలియా, భారత్ సైతం ఇందుకు మినహాయింపు కాదు.. మేం టోర్నీ గెలవాలంటే మాత్రం నంబర్‌వన్‌గా ప్రవేశించం.. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌తో మ్యాచ్‌లో రూపొందిన వికెట్ తమ క్రికెట్ శైలికి అనుకూలంగా లేదని.. కానీ పాక్‌కు సరిపోయిందని, నాటి ఓటమి నుంచి ఎంతో నేర్చుకున్నామని స్టోక్స్ స్పష్టం చేశాడు.