ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20  ప్రపంచకప్ కు ముందే భారత జట్టు మరింత బిజీ షెడ్యూల్ లో ఉండనున్నది. ఇప్పటికే తీరిక లేని షెడ్యూల్ ఉండగా బీసీసీఐ మరో రెండు సిరీస్ లు ఏర్పాటు  చేసింది. 

చూస్తుంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియాను ఖాళీగా ఉంచేట్టు కనిపించడం లేదు. టీ20 ప్రపంచకప్ కు ముందు ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ కల్పించేందుకు గాను వీలైనన్ని ఎక్కువ సిరీస్ లు ఏర్పాటుచేస్తున్నది. ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కంటే ముందే భారత జట్టు రెండు అగ్రస్థాయి జట్లతో ఢీకొననుంది. ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్ ను ఖరారు చేసింది. టీ20 ప్రపంచకప్ కు ముందు భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. గురువారం ముంబైలో జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆసీస్, సఫారీ సిరీస్ ల విషయాలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.

ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. అది ముగిశాక నేరుగా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 22తో ఆ సిరీస్ కు స్వస్తి చెప్పి నేరుగా ఆసియా కప్ లో ఆడాల్సి ఉంది. ఆగస్టు 27 నుంచి ఇది మొదలుకావాల్సి ఉంది.

సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు భారత జట్టుకు మధ్యలో మ్యాచ్ లు ఏమీ లేవనే లోటును గమనించిన బీసీసీఐ.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో మూడేసి టీ20 మ్యాచుల సిరీస్ లను ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు సఫారీలతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా భారత్ కు రావడం ఇది రెండో సారి అవుతుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా.. టీమిండియాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. 

ఈ సిరీస్ లో తొలి రెండు మ్యాచులు ఓడినా తర్వాత రెండింటిలో నెగ్గింది భారత్. సిరీస్ లో నిర్ణయాత్మక బెంగళూరు టీ20 వర్షార్పణం అయింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాకు వెళ్లిన భారత జట్టు అక్కడ టెస్టులతో పాటు వన్డే సిరీస్ లోనూ ఓడిన విషయం తెలిసిందే.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కంటే ముందే ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల సిరీస్ ఆడనుంది టీమిండియా. 2021 జనవరి తర్వాత ఈ ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్ (పరిమిత ఓవర్లలో) లు ఆడలేదు. దీంతో టీ20 ప్రపంచకప్ కు ముందు ఇరు జట్లకు ఈ సిరీస్ మంచి ప్రాక్టీస్ కానుంది. సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు ఈ మ్యాచులు జరుగుతాయి. ఆసీస్ తో సిరీస్ లో భాగంగా జరుగబోయే మూడో మ్యాచ్ హైదరాబాద్ లో జరుగనుంది. 

ఆస్ట్రేలియాతో.. 

- తొలి టీ20 మ్యాచ్ - మొహాలీ (సెప్టెంబర్ 20)
- రెండో టీ20 - నాగ్‌పూర్ (సెప్టెంబర్ 23)
- మూడో టీ20 - హైదరాబాద్ (సెప్టెంబర్ 25)

దక్షిణాఫ్రికాతో సిరీస్ ను లక్నో, రాంచీ, ఇండోర్ లలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.