Asianet News TeluguAsianet News Telugu

IPL: కరోనా టెన్షన్.. ఐపీఎల్ వేదిక, తేదీలలో మార్పులు..? ఎటూ తేల్చుకోలేకపోతున్న బీసీసీఐ

IPL 2022: దేశంలో క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  ఐపీఎల్ మెగా వేలం వేదికతో పాటు తేదీలు కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను బట్టి బీసీసీఐ తదుపరి ప్రక్రియను చేపట్టనున్నది. 

BCCI Wants to Shift IPL Auction Venue From Bengaluru, Dates Can also change, Reports
Author
Hyderabad, First Published Jan 4, 2022, 6:38 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా వ్యాప్తి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)  నిర్వహించదలిచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  మెగా వేలం మీద పడింది. వచ్చే ఏడాది జరిగే సీజన్ కోసం మెగా వేలాన్ని నిర్వహించేందుకు గత కొద్దిరోజులుగా బీసీసీఐ.. తేదీలు, వేదికలను మార్చుతూనే ఉన్నది. ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన బెట్టింగ్ ఆరోపణలపై బీసీసీఐ ఇంకా తేల్చేలేదు. గతంలో మెగా వేలాన్ని ఫిబ్రవరి 12, 13 తేదీలలో  బెంగళూరు వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు  చూపింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చకచకా పూర్తి చేసుకుంటున్న తరుణంలో దేశంలో కొత్తగా విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ తో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఐపీఎల్  మెగా వేలం వేదికతో పాటు తేదీలు కూడా మారే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.  ముందుగ నిర్ణయించిన దాని ప్రకారం.. మెగా వేలం వేదికను బెంగళూరు నుంచి కోల్కతా (పశ్చిమబెంగాల్) గానీ కొచ్చి (కేరళ) గానీ ముంబై (మహారాష్ట్ర) కు మార్చాలని యోచిస్తున్నది. అయితే అక్కడ కూడా ఇటీవలి కాలంలో కేసులలో పెరుగుదల గణనీయంగా ఉంది. 

ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ.. ‘కొన్ని సార్లు మనచేతుల్లో ఏమీ ఉండదు.  అప్పుడప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురౌతాయి. వేచిచూడక తప్పదు. పలు రాష్ట్రాలలో కొవిడ్ నిబంధనలున్నాయి. అయితే మేము అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం... ఆ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లతో మాట్లాడుతున్నాం.. అన్ని విధాలుగా ఆలోచించాకే  తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాం..’ అని తెలిపాడు. 

ఇదిలాఉండగా బెంగళూరులోని ప్రముఖ వైట్ ఫీల్డ్ హోటల్ లోని షెరాటన్ గ్రాండ్ లో ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావించినా అందులో ప్రస్తుతం  ప్రో కబడ్డీ లీగ్ ను నిర్వహిస్తున్నారు. మరో రెండు మూడు  పెద్ద హోటల్ లు ఉన్నా రాబోయే రెండు మూడు రోజుల్లో అక్కడ కరోనా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.  

సాధారణంగానే ఐపీఎల్ వేలం అంటే ఆయా ఫ్రాంచైజీలకు చెందిన అధికారులు, ప్రతినిధులు వందల సంఖ్యలో హాజరవుతారు.  మరోవైపు సామూహిక సమావేశాలకు అనుమతి దొరకడం రాబోయే రోజుల్లో చాలా కష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా వేదిక, తేదీల మార్పుపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios