పుల్వామా ఉగ్రదాడిలో సైనికులను కోల్పోయి దేశం యావత్తు దు:ఖంలో మునిగిన సమయంలో సంబరాలకు దూరంగా వుండాలపి బిసిసిఐ నిర్ణయించింది. దీంతో ఏటా అట్టహాసంగా జరిపే ఐపిఎల్ ప్రారంభోత్సవ వేడుకలను ఈసారి నిర్వహించడం లేదని గతంలోనే సీఓఏ అధికారి వినోద్ రాయ్ ప్రకటించారు. ఆరంభ వేడుకల కోసం కేటాయించిన నగదుతో పాటు మరికొంత జతచేసి సైనిక సంక్షేమ నిధికి విరాళం అందించనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఈ మేరకు మరికొద్దిరోజుల్లో జరగనున్న ఐపిఎల్ 12 ఆరంభ మ్యాచ్ లోనే తమ హామీని నెరవేర్చాలని బిసిసిఐ భావిస్తోంది. 

గతేడాది భాలీవుడ్ స్టార్లతో పాటు అంతర్జాతీయ ఆర్టిస్ట్ లతో ఐపిఎల్ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇలా అట్టహాసంగా జరిగిన కార్యక్రమం కోసం బిసిసిఐ దాదాపు రూ.15కోట్లు ఖర్చు చేసింది. కాబట్టి సీజన్ 12లో వేడుకల కోసం ఖర్చేచేయకుండా మిగిలిస్తున్న రూ.15 కోట్లకు మరో రూ.5 కోట్లు జతచేసి మొత్తం రూ.20 కోట్లు భారత సైనికుల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. 

అయితే ఈ హామీని కూడా ఈ నెల 23న జరిగే ఐపిఎల్ ఆరంభ మ్యాచ్ లోనే  నెరవేర్చాలని బిసిసిఐ ప్రయత్నిస్తోంది. అందుకోసం భారత సైనిక దళానికి చెందిన ఉన్నతాధికారులను గానీ, రక్షణ శాఖకు చెందిన అధికారులను గానీ చెన్నై వేదికగా జరిగే ఆరంంభ మ్యాచ్ కు ఆహ్వానించి... విరాళానికి సంబంధించిన రూ.20కోట్ల చెక్కును అందించాలని చూస్తోంది. ఇలా బిసిసిఐ భారీ విరాళాన్ని ప్రకటించి సైనికులకు అండగా నిలిచింది.