India Tour Of West Indies: ఇంగ్లాండ్ పర్యటన ముగించుకున్న భారత జట్టు నేరుగా అక్కడ్నుంచి కరేబియన్ దీవులకు వెళ్లింది. ఇందుకోసం బీసీసీఐ ఆటగాళ్లకు ప్రత్యేక విమానం బుక్ చేసింది.
ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా ఆటగాళ్లకు ఏ కష్టాలు లేకుండా చూసుకుంటున్నది. కరోనా కారణంగా బిజినెస్ క్లాస్ లో వెళ్లి ‘ఇబ్బందులు’ పడ్డ క్రికెటర్లకు ఇక నుంచి అలాంటి ‘కష్టాలు’ రాకుండా ప్రత్యేక విమానంలో వారిని పంపిస్తున్నది. మరి ప్రత్యేక విమానం అంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది కదా..? అనే డౌటానుమానాలు మీకు వచ్చాయా..? అక్కడుంది బీసీసీఐ. అట్లుంటది మరి దాంతోని..
ఇంగ్లాండ్‌తో మూడో వన్డే ముగిశాక మాంచెస్టర్ నుంచి ట్రినిడాడ్ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్) వెళ్లడానికి గాను చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసింది. ఇందుకోసం అయిన ఖర్చు ఏకంగా రూ. 3.5 కోట్లు. అయినా సరే ‘ఆటగాళ్ల సౌకర్యార్థం’ బీసీసీఐ ఈ ఖర్చును భరించింది.
సాధారణంగా అయితే మాంచెస్టర్ టు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ కు బిజినెస్ క్లాస్ టికెట్ రూ. 2 లక్షల దాకా ఖర్చవుతుంది. మొత్తంగా చూసినా భారత ఆటగాళ్లు, వారి భార్యాపిల్లలు, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కోచింగ్ సిబ్బంది, ఇతరత్రా అందరినీ కలిపి కమర్షియల్ ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ టికెట్ లో పంపినా అంతా రూ. 2 కోట్లు ఖర్చయ్యేది. కానీ బీసీసీఐ మాత్రం వీరందరికీ బిజినెస్ క్లాస్‌లో కాక చార్టర్డ్ ఫ్లైట్ లో పంపింది.
ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘టీమిండియా ఆటగాళ్లను మాంచెస్టర్ నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ పంపడానికి బీసీసీఐ రూ. 3.5 కోట్లు ఖర్చు చేసింది. మేము టీమిండియా బృందం కోసం చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేయడం వల్లే ఇంత ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇంతమందికి కలిపి కమర్షియల్ ఫ్లైట్స్ లో బిజినెస్ క్లాస్ లో టికెట్లు బుక్ చేయడం కష్టంతో కూడుకున్న వ్యవహారం. అందుకే వీళ్లందరి కోసం ఖర్చు ఎక్కువైనా చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేశాం..’అని తెలిపారు.
కమర్షియల్ విమానాలతో పోలిస్తే చార్టర్డ్ ఫ్లైట్స్‌లో ఖర్చు ఎక్కువైనా టికెట్ బుకింగ్ తంటాలు, కొవిడ్-19 భయాలు, ఇతరత్రా లేకుండా ఎంచక్కా కేవలం జట్టుమాత్రమే ప్రయాణించే వీలుంటుంది. ఇప్పుడు ఫుట్‌బాల్ జట్లు కూడా ఇలాగే ప్రయాణిస్తున్నాయి సెలవిచ్చారు సదరు బీసీసీఐ ప్రతినిధి. అయినా ఒక్క ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారానే సుమారు రూ. 50వేల కోట్లు ఆర్జించిన బీసీసీఐకి చార్టర్డ్ ఫ్లైట్ కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేయడం పెద్ద లెక్కా..? అంటున్నారు ఇది చూసిన టీమిండియా అభిమానులు.
