నూతన నిబంధనల ప్రకారం జూన్‌ 30తో కార్యదర్శిగా అనర్హుడైన జై షాకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్‌ కౌన్సిల్‌లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. హోమ్ మంత్రి అమిత్ షా తనయుడికి సైతం వ్యతిరేకత ఎదురవుతుండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

రాజ్యాంగం ప్రకారం, బీసీసీఐ సమావేశాలకు జై షా హాజరు కావడానికి వీల్లేదు. జులై 17న బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా వివరాలను జులై 3న జై షా ఇతర సభ్యులకు ఈమెయిల్‌ చేశారు. జై షా ఎజెండా ఈమెయిల్‌కు అపెక్స్‌ కౌన్సిల్‌లో కాగ్‌ ప్రతినిధి అల్కా రెహాని భరద్వాజ్‌ స్పందించారు. 

అపెక్స్‌ కౌన్సిల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశానికి అర్హులైన వ్యక్తులే హాజరు అయ్యేలా చూడాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, సంయుక్త కార్యదర్శి జయేశ్‌ రంజన్‌లకు అల్కా రెహాని ఈమెయిల్‌ పంపించారు. ఈమెయిల్‌లో ప్రత్యేకంగా జై షా పేరు ప్రస్తావించకపోయినా.. నూతన రాజ్యాంగం ప్రకారం అర్హులైన ఆఫీస్‌ బేరర్లు మాత్రమే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి రావాలని, ఆ విధంగా చూడాల్సిన బాధ్యత అధ్యక్షుడు, సంయుక్త కార్యదర్శిపై ఉందని గుర్తు చేసింది. 

జూన్‌ 30తో జై షా బీసీసీఐ, అనుబంధ సంఘాల్లో (గుజరాత్‌ క్రికెట్‌ సంఘం)లో ఆరేండ్ల పదవీకాలం ముగించుకున్నాడు. త్వరలోనే అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, సంయుక్త కార్యర్ధి జయేశ్‌ రంజన్‌లు సైతం ఆరేండ్ల పదవీకాలం ముగించుకోనున్నారు. 

రాజ్యాంగ సవరణ కోసం బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేసింది. అందుకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదం లభించకపోతే.. భారత క్రికెట్‌ బోర్డు మరోసారి నాయకత్వ సంక్షోభం ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తోంది.