Umran Malik: ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున ఆడుతూ అదరగొడుతున్న కశ్మీరి కుర్రాడు ఉమ్రాన్ మాలిక్  త్వరలోనే ‘మెన్ ఇన్ బ్లూ’లో చేరబోతున్నాడా..? టీమిండియాలోకి ఈ  స్పీడ్ గన్ రావడానికి ముహుర్తం ఖరారైందా..? 

గత ఐపీఎల్ సీజన్ నుంచి నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరుతూ అందరిచేత ప్రశంసలు అందుకుంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ త్వరలోనే భారత జట్టులో చేరనున్నాడా..? బీసీసీఐ సెలెక్టర్ల కన్ను ఈ స్పీడ్ గన్ మీద పడిందా.? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఐపీఎల్ లో మ్యాచ్ మ్యాచ్ కు తన బౌలింగ్ లో మెరుగులు దిద్దుకుంటూ అటు ఐపీఎల్ అభిమానులను ఇటు రాజకీయ నాయకులను కూడా తన అభిమానులుగా చేసుకుంటున్న ఈ కశ్మీరి కుర్రాడు త్వరలోనే భారత జట్టుకు ఆడనున్నట్టు తెలుస్తున్నది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అతడిని త్వరలో భారత జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.

ఇదే విషయమై బీసీసీఐ సెలెక్షన్ కమిటీలోని ఓ సభ్యుడు మాట్లాడుతూ.. ‘ఉమ్రాన్ మాలిక్ లో స్పెషల్ టాలెంట్ ఉంది. అతడి బౌలింగ్ కు అందరూ మంత్రముగ్దులవుతున్నారు. అతడు తప్పకుండా మా (బీసీసీఐ సెలెక్షన్ కమిటీ) జాబితాలో ఉన్నాడు..’ అని చెప్పాడు. 

దక్షిణాఫ్రికా జట్టు త్వరలోనే భారత జట్టు పర్యటనకు రానున్నది. భారత్ తో ఐదు వన్డేలు ఆడేందుకు ఉపఖండం రానున్న సఫారీ జట్టుకు పేస్ రుచి చూపించేందుకు ఉమ్రాన్ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారు. వరుసగా మూడు ఫార్మాట్లలో ఆడుతున్న బుమ్రా, షమీ, సిరాజ్ వంటి వాళ్లకు విశ్రాంతినిచ్చి జట్టులో యువ రక్తాన్ని నింపేందుకు ఈ సిరీస్ మంచి ఛాన్స్ కానున్నది. అదీ గాక ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ కూడా జరగాల్సి ఉన్నది.

Scroll to load tweet…

ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామంగా ఉండే ఆసీస్ ఫిచ్ లపై ఉమ్రాన్ వంటి పేసర్లు తప్పకుండా రాణించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా అతడిని జట్టులోకి ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు. 

అంతకంటే ముందే దక్షిణాఫ్రికా జూన్ లో (9, 12, 14, 17, 20) భారత పర్యటనకు వచ్చి టీ20 సిరీస్ ఆడనుండటంతో ఉమ్రాన్ పరీక్షించేందుకు భారత్ కు చక్కని అవకాశం. దక్షిణాఫ్రికా సిరీస్ తో పాటు ఐర్లాండ్ తో కూడా టీమిండియా రెండు టీ20 లు ఆడనుంది. జూన్ 26, 28న ఈ మ్యాచ్ లు ఉంటాయి. దక్షిణాఫ్రికా తో పాటు ఐర్లాండ్ టూర్ కు కూడా ఉమ్రాన్ ను తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ వర్గాలు తెలిపాయి.

ఐపీఎల్ - 2022 సీజన్ లో ఇప్పటివరకు 6 మ్యాచులాడిన ఉమ్రాన్.. 9 వికెట్లు తీశాడు. తొలుత మూడు మ్యాచులలో కాస్త పరుగులిచ్చుకున్నా తర్వాత దారిలో పడ్డాడు. ఇప్పుడు నెమ్మదిగా పరుగులు తగ్గివ్వడమే గాక వికెట్లు కూడా తీస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన గత మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ చివరి ఓవర్ ఈ కుర్రాడికే ఇచ్చాడంటే అతడి పై సారథికి ఉన్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ నమ్మకాన్ని ఉమ్రాన్ వమ్ము చేయలేదు. ఆ ఓవర్ లో ఒక్క పరుగు ఇవ్వకపోగా ఏకంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు.