బీసీసీఐ చారిత్రక నిర్ణయం.. ఐపీఎల్ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్
ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. చారిత్రక మ్యాచ్ ఫీజును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం క్రికెటర్లు అన్ని మ్యాచ్‌లు ఆడితే అదనంగా రూ.1.05 కోట్లు పొందుతారు.
బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐపీఎల్‌లో చారిత్రక మ్యాచ్ ఫీజును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం.. క్రికెటర్లు అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు అదనంగా రూ.1.05 కోట్లు పొందుతారు. ఇలా ఒక్కో మ్యాచ్ ఫీజు రూ.7.5 లక్షలు అదనంగా అందుకుంటారు. ఈ మేరకు ఏసీసీ ప్రెసిడెంట్, బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు.
'మా క్రికెటర్లకు ఒక్కో మ్యాచ్ ఫీజు రూ.7.5 లక్షలు ప్రవేశపెట్టడం ఆనందంగా ఉంది. ఒక సీజన్‌లో అన్ని లీగ్ మ్యాచ్‌లు ఆడే క్రికెటర్‌కి కాంట్రాక్ట్ మొత్తానికి అదనంగా రూ.1.05 కోట్లు లభిస్తాయి' అని జై షా తన పోస్టులో పేర్కొన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు స్ట్రక్చర్‌ని జై షా ప్రవేశపెట్టారు. ఐపీఎల్ 2025 నుంచి ఒక సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడినందుకు రూ.1.05 కోట్లు, ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కి రూ.7.5 లక్షలు ఆటగాళ్లు అందుకోనున్నారు.
ఈ సీజన్ కోసం ప్రతి ఫ్రాంచైజీకి మ్యాచ్ ఫీజు కింద రూ.12.60 కోట్లు కేటాయిస్తామని జైషా తెలిపారు. ఇప్పటికే వేలంలో ఆటగాళ్లకు భారీ కాంట్రాక్టులతో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన టీ20 ఫ్రాంచైజీ లీగ్గా నిలిచింది.
ఏ ఫ్రాంఛైజీ క్రికెట్ లీగ్ కూడా మ్యాచ్ ఫీజును ఆఫర్ చేయదు.. కాబట్టి ఐపీఎల్ కోసం బిసిసిఐ కొత్త నిర్ణయం మార్కెట్లో వారి విలువ కంటే తక్కువ సంపాదిస్తున్న ఆటగాళ్లకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఉదాహరణకు కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ ప్రస్తుతం సీజన్‌కి కేవలం రూ.50 లక్షలు మాత్రమే తీసుకుంటున్నాడు. కానీ అతను అన్ని మ్యాచ్‌లు ఆడితే మ్యాచ్ ఫీజు నుండి దాదాపు రెట్టింపు సంపాదిస్తాడు.
కాగా, రాబోయే రోజుల్లో బీసీసీఐ కొత్త రిటెన్షన్ రూల్స్, ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఐదు రిటెన్షన్లను అనుమతించాలని, వేలానికి ముందు ఆర్టీఎం కార్డు ఆప్షన్‌ను తిరిగి తీసుకురావాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.