Asianet News TeluguAsianet News Telugu

ఏం సపోర్ట్ కావాలి నీకు..? పక్కన కూర్చుని జో కొట్టమంటావా..? కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ, గవాస్కర్ గరం గరం

BCCI Responds On Kohli Comments: తాను టెస్టు కెప్టెన్సీ వదిలేసినప్పుడు  తనకు ధోని తప్ప ఎవరూ మద్దతుగా నిలవలేదని  కోహ్లీ చేసిన కామంట్స్ బీసీసీఐలో కాకరేపాయి. కోహ్లీకి ఏ రకమైన మద్ధతు కావాలని బీసీసీఐ అసహనం వ్యక్తం చేసింది. 

BCCI Responds On Virat Kohli's Lack Of Support Remark, Gavaskar Slams  Former Skipper
Author
First Published Sep 6, 2022, 11:01 AM IST

ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కోహ్లీ వర్సెస్ బీసీసీఐ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఏడాది కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న కోహ్లీ-బీసీసీఐ మధ్య వివాదాలు మళ్లీ  యథాస్థితికి వచ్చినట్టే ఉన్నాయి. ఇందుకు విరాట్ కోహ్లీ తాజాగా చేసిన వ్యాఖ్యలు కారణమయ్యాయి. ఆసియా కప్-2022లో భాగంగా  పాకిస్తాన్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత   నిర్వహించిన విలేకరుల సమావేశంలో  విరాట్ కోహ్లీ.. తాను టెస్టు కెప్టెన్సీ పగ్గాలు వదిలేసినప్పుడు  మాజీ సారథి  మహేంద్ర సింగ్ ధోని తప్ప ఎవరూ తనకు మద్దతుగా నిలవలేదని చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ తో పాటు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా  అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ..  గడ్డుకాలంలో కోహ్లీకి బీసీసీఐ అండగా నిలిచిందని, అసలు కోహ్లీ ఏం మాట్లాడుతున్నాడో తమకైతే అర్థం కావడం లేదని  తెలిపాడు. కోహ్లీ టెస్టు కెప్టెన్సీ వదిలేశాక బీసీసీఐ లోని సభ్యులందరూ సోషల్ మీడియా వేదికగా అతడి భవిష్యత్ బాగుండాలని ఆశిస్తూ శుభాకాంక్షలు చెప్పామని గుర్తు చేశాడు. 

కోహ్లీ ఏం చెప్పాడు..?  

‘నేను టెస్టు కెప్టెన్సీ వదిలేసినప్పుడు  ఒక్క ధోని  మాత్రమే నాకు మెసేజ్ చేశాడు. నా ఫోన్ నెంబర్ చాలా మంది దగ్గరుంది.  కానీ ఒక్కరు కూడా  నాకు వ్యక్తిగతంగా ఫోన్ గానీ మెసేజ్ గానీ చేయలేదు.  నేను ఎవరి గురించైనా మాట్లాడేప్పుడు  నేరుగా వాళ్లకే చెబుతా గానీ  బయిట  ఏదీ వ్యాఖ్యానించను..’ అని అన్నాడు. ఇవే వ్యాఖ్యలు ఇప్పుడు కాకరేపాయి. 

 

బీసీసీఐ ఏమంటోంది..? 

‘కోహ్లీకి బీసీసీఐ మద్దతుఉంది. అతడి జట్టు సభ్యులు, టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ అందరూ కోహ్లీ గడ్డుకాలంలో అండగా నిలబడ్డారు.  కోహ్లీకి మద్దతు అందలేదని అనడం కరెక్ట్ కాదు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నా కోహ్లీకి అండగా నిలిచాం. కొన్ని రోజులు విరామం కావాలంటే అది కూడా ఇచ్చాం. కోహ్లీ టెస్టు కెప్టెన్సీ వదిలేశాక  బీసీసీఐతో పాటు ఇందులోని సభ్యులంతా అతడి భవిష్యత్ బాగుండాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.  ఇంతచేసినా కోహ్లీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు..? ఏం మద్దతు కోరుకుంటున్నాడనేది విచిత్రంగా ఉంది..’ అని  బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

గవాస్కర్ ఏమన్నాడు..? 

కోహ్లీ వ్యాఖ్యలపై సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో  స్పందించాడు.  ‘‘విరాట్ ఎవరి మద్దతు కోరుతున్నాడో చెప్పలేదు. అతడు ప్రత్యేకించి ఎవరి పేరైనా చెబితే వారిని వెళ్లి అడగొచ్చు.. సదరు వ్యక్తి దగ్గరికెళ్లి ‘బ్రో నీ దగ్గర నా నెంబర్ ఉంది. మరి నేను టెస్టు కెప్టెన్సీ వదిలేసినప్పుడు నాకెందుకు మెసేజ్ చేయలేదు’ అని..  మరి కోహ్లీ ఆవేదన ఎవరి గురించి..? తనతో  ఆడినవారి గురించా..? లేక మాజీ ఆటగాళ్ల గురించా..?  

అసలు కోహ్లీకి ఏం మద్దతు కావాలి..? నువ్వు టెస్టు కెప్టెన్సీ వదిలేశావ్. ఇంక నీకు మద్దతు దేనికి..? నీ కెప్టెన్సీ ముగిసింది. ఇప్పుడు నువ్వు జట్టులో 11 మందితో పాటు ఒకడివి. ఆ పాత్రకు సరైన న్యాయం  చెయ్. నువ్వు  నీ ఆట గురించి, జట్టు సభ్యుల గురించి ఆలోచించాలి. ఒక్కసారి నువ్వు కెప్టెన్సీ వదిలేశాక నువ్వు   నీ ఆటమీద దృష్టి సారించాలేగానీ వీటి మీద కాదు.  నేను 1985లో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ ముగిశాక కెప్టెన్సీ వదిలేశాను.  అప్పుడు నాకు ఎవరూ ప్రత్యేకించి సందేశాలు పంపలేదే..? ఆ రోజు రాత్రి నా టీమ్ తో కలిసి పార్టీ చేసుకున్నాం. ఒకరిని ఒకరం హగ్ చేసుకున్నాం. అంతే. మరుసటి రోజు నుంచి అంతా మాములే. ఇంతకుమించి ఇంకేం ఆశిస్తాం..?’’ అని  సన్నీ తెలిపాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios