భారత క్రికెట్ జట్టుకు ముప్పు ఉందంటూ బీసీసీఐకి బెదిరింపు మెయిల్స్ రావడం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. భారత క్రికెటర్ల కదలికల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నామని... మీ ఆటగాళ్లు ప్రమాదంలో ఉన్నారంటూ బీసీసీఐకి ఆదివారం ఈ మెయిల్ వచ్చింది.

వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు అంటిగ్వాలోని భారత హైకమిషన్‌కు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఇండియన్ ఎంబసీ అధికారులు.. స్థానిక ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా... భారత ఆటగాళ్లకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

క్రికెటర్ల భద్రత పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. అక్కడి పరిస్ధితులపై ప్రత్యేక నిఘా ఉందని.. అవసరమైతే మరింత భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.. విండీస్ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.