సోమవారం కరోనా పాజిటివ్‌గా తేలిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... నాలుగు రోజుల్లోనే కోలుకుని, ఆసుపత్రి నుంచి డిశార్చి...

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కొన్నాళ్ల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. సోమవారం కరోనా పాజిటివ్‌గా తేలిన సౌరవ్ గంగూలీ, నాలుగు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశార్చ్ అయ్యాడు. గంగూలీ ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వడంతో డిశార్చ్ చేసిన వైద్యులు, ఇంట్లోనూ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా సూచించారు... 

కోల్‌కత్తాలోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు చికిత్స చేయించుకున్న సౌరవ్ గంగూలీ, ఒమిక్రాన్ వేరియెంట్‌ పరీక్షల్లో నెగిటివ్గా తేలడంతో డిశార్చ్ అయ్యాడు. గంగూలీకి ‘మోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్‌టాయిల్’ థెరపీ అందించిన వైద్యులు, ఆయన ఆరోగ్యం స్థిమితంగా ఉండడంతో ఇంటికి వెళ్లవచ్చని సూచించారట...

49 ఏళ్ల సౌరవ్ గంగూలీ ఈ ఏడాది జనవరిలో కూడా అనారోగ్యానికి గురయ్యాడు. ఛాతిలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన గంగూలీ, కొన్ని రోజుల తర్వాత గుండెపోటుతో మరోసారి అనారోగ్యానికి గురయ్యాడు. కోల్‌కత్తాలోని తన నివాసంలో వ్యాయామం చేస్తున్న సమయంలో సౌరవ్ గంగూలీకి గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు...

ఆ సమయంలో గంగూలీ గుండె కుడి భాగానికి యాంజియోప్లాస్టీ చికిత్స నిర్వహించిన వైద్యులు, 20 రోజుల తర్వాత మరోసారి గుండెపోటు రావడంతో జనవరి 28న మరోసారి గుండెకి శస్త్రచికిత్స నిర్వహించారు. సౌరవ్ గంగూలీ గుండెకి రెండు సెంట్లు వేశారు...

మార్చి నుంచి తిరిగి విధుల్లో చేరిన సౌరవ్ గంగూలీ, ఇప్పటికే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ కోర్సును కూడా పూర్తి చేయడం విశేషం. గంగూలీ అన్న స్నేహశీస్ గంగూలీ కూడా ఈ ఏడాది ఆరంభంలో కరోనా బారిన పడ్డాడు...

Scroll to load tweet…

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే భారత జట్టు సెంచూరియన్ టెస్టు విజయంపై సోషల్ మీడియా ద్వారా స్పందించాడు సౌరవ్ గంగూలీ... ‘గ్రేట్ విక్టరీ టీమ్ ఇండియా. ఈ ఫలితాన్ని చూసి, నేను సర్‌ప్రైజ్ కాలేదు. టీమిండియాను ఈ టెస్టు సిరీస్‌లో ఓడించడం చాలా కష్టం. భారత జట్టును ఓడించాలంటే సౌతాఫ్రికా తమ శాయశక్తులా శ్రమించాల్సిందే... న్యూ ఇయర్‌ని ఎంజాయ్ చేయండి...’ అంటూ ట్వీట్ చేశాడు సౌరవ్ గంగూలీ...

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై పెను దుమారం రేగింది. ఈ విషయంలో సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్లను కోహ్లీ కొట్టిపారేయడంతో విరాట్ ఫ్యాన్స్, బీసీసీఐ అధ్యక్షుడిపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. భారత క్రికెట్ బోర్డులో రాజకీయాలు చేస్తున్న సౌరవ్ గంగూలీ, ఆ పదవికి తగిన వాడు కాదంటూ, అయినా పదవీకాలం ముగిసిన వ్యక్తి, ఇంకెన్నాళ్లు ఆ పొజిషన్‌లో కొనసాగుతాడంటూ తీవ్ర పదజాలంతో దాదాపై ట్రోల్స్ చేశారు.