అఫ్గాన్‌తో సిరీస్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..! అలా అయితే మ్యాంగో మ్యాన్ వర్సెస్ కోహ్లీ ఫైట్ లేనట్టే..
మరో రెండ్రోజుల్లో ముగియబోయే ఐపీఎల్ - 16 తర్వాత భారత జట్టు బిజీబిజీగా గడపనుంది. ఐపీఎల్ అయిపోయిన వెంటనే ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుండగా అది ముగిసిన తర్వాత కూడా కీలక షెడ్యూల్స్ ఉన్నాయి.

జులై - ఆగస్టులలో భారత జట్టు నెల రోజుల పాటు వెస్టిండీస్ లో గడపనుంది. అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 లు ఆడేందుకు షెడ్యూల్ కూడా దాదాపుగా ఖరారైంది. దాని తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్, ఆసియా కప్ కూడా ఉండనుంది. అయితే జూన్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత భారత జట్టు జులై వరకూ కాస్త తీరికగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. గతంలో ఆఫ్గానిస్తాన్ తో మూడు వన్డేలు ఆడేందుకు ప్లాన్ చేసింది. ఇది ముందుగా అనుకున్న సిరీస్ కాదు.. ఐసీసీ ప్రకటించిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) లో కూడా ఇది లేనప్పటికీ అఫ్గాన్ బోర్డు కోరిక మేరకు బీసీసీఐ కూడా అంగీకారం తెలిపింది.
కానీ తాజా రిపోర్టుల ప్రకారం ఈ సిరీస్ ఫార్మాట్ మారే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. వన్డేల రూపంలో కాకుండా దీనిని టీ20 ఫార్మాట్ లోకి మార్చేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.
వాస్తవానికి డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత.. జులై వరకూ దొరికే టైమ్ తప్ప భారత జట్టుకు మళ్లీ ఇంత గ్యాప్ దొరకదు. అసలే ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ ఉంది. ఇదివరకే రెండు నెలలుగా సాగుతున్న ఐపీఎల్ తో ఆటగాళ్లంతా అలిసిపోయి ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఒత్తిడి కూడా వాళ్ల మీద ఉంది. ఈ నేపథ్యంలో వారిని అఫ్గాన్ సిరీస్ తో ఆడించి మరింత ఇబ్బందిపెట్టడం కంటే విశ్రాంతినిచ్చిందే బెటర్ అని బీసీసీఐ భావిస్తున్నది.
ఒకవేళ వన్డే ఫార్మాట్ ఫిక్స్ అయితే మాత్రం వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో ఉన్న మెయిన్ టీమ్ ను పక్కనబెట్టి హార్ధిక్ పాండ్యా సారథ్యంలో సెకండ్ టీమ్ ను ఆడించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నది. ఇదే జరిగితే రోహిత్, కోహ్లీ వంటి సీనియర్లకు రెస్ట్ ఇస్తారు. ఒకవేళ ఇలా కాకున్నా టీ20 ఫార్మాట్ లో ఆడించినా అప్పుడు కూడా వీళ్లకు పోయేదేమీ లేదు. దీనిపై త్వరలోనే బీసీసీఐ, అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తుది నిర్ణయం ప్రకటించే అవకాశముంది. ఐపీఎల్ ఫైనల్ చూసేందుకు గాను ఏసీబీ అధ్యక్షుడు మిర్వైస్ అష్రఫ్ అహ్మదాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన.. అఫ్గాన్ - ఇండియా సిరీస్ మీద కూడా చర్చించనున్నట్టు తెలుస్తున్నది. ఇదే సమావేశంలో ఆసియా కప్ నిర్వహణ పై కూడా తుది ప్రకటన వెలువడే అవకాశమున్నది.
అయితే అంతా బాగానే ఉన్నా కోహ్లీ అభిమానులకు మాత్రం ఇది కాస్త బ్యాడ్ న్యూసే. ఐపీఎల్ లో లక్నో - బెంగళూరు మ్యాచ్ లో కోహ్లీ - నవీన్ ఉల్ హక్ (అఫ్గాన్ పేసర్)మధ్య వాగ్వాదం తర్వాత విరాట్ ఫ్యాన్స్ అతడిని టార్గెట్ చేశారు. ఐపీఎల్ లో మళ్లీ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగాలని కోరుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. అయితే అఫ్గాన్ - ఇండియా వన్డే సిరీస్ లో నవీన్ కు కోహ్లీ చేతిలో ఉందని ఆశపడ్డా ఇప్పుడు బీసీసీఐ నిర్ణయంతో వారికి కాస్త నిరాశే మిగలనుంది.