ముంబై: బిసిసిఐ పగ్గాలు చేపట్టబోయే సౌరవ్ గంగూలీకి అన్ని వైపుల నుంచి అభినందనలు అందుతున్నిాయి. సోషల్ మీడియాలో ఆయనపై అభినందనల వెల్లువ కురుస్తోంది. ఈ క్రమంలోనే దాదాకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన టీమిండియా మాజీ డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపాడు. ట్వీట్ లో యువీ గంగూలీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

తన కెప్టెన్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపాడు. టీమిండియా కెప్టెన్ నుంచి బిసిసిఐ అధ్యక్షుడి వరకు గొప్ప వ్యక్తి గంగూలీ అని ఆయన అన్నాడు. గంగూలీది గొప్ప ప్రయాణమని కూడా వర్ణించాడు. క్రికెటర్ పాలనలోకి దిగితే అదేవిధంగా ఆటగాళ్ల కోణం నుంచి పాలన సాగించడం ఎలా ఉంటుందో ఆలోచించాలని ఆయన అన్నాడు. గుడ్ లక్ దాదా అని చెప్పాడు. 

యువీ ట్వీట్ కు గంగూలీ కూడా అదే రీతిలో జవాబిచ్చాడు. థాంక్యూ బెస్ట్... ఇండియా కోసం ప్రపంచ కప్ లు గెలిచావని అన్నాడు. ఇక ఆట కోసం మంచి పనులు చేయాల్సి ఉంటుదని సంకేతాలు ఇచ్చాడు. "నువ్వు నా సూపర్ స్టార్ వి. ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయ"ని అన్నాడు.

గంగూలీ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యను బట్టి భారత్ క్రికెట్ లో యువరాజ్ సింగ్ కీలకమైన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. యువరాజ్ సింగ్ ఈ ఏడాది జూన్ లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 

తనకు విషెస్ చెప్పిన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు కూడా దాదా బదులిచ్చాడు. "థాంక్యూ భజ్జీ. నువ్వు ఎలాగైతే భారత్ కు విజయాలు అందించావో అదే తరహా నీ సహకారం మాకు కావాలి. భజ్జీ... నీ అవసరం ఉంది" అని గంగూలీ హర్బజన్ ట్వీట్ కు స్పందించాడు.