ICC ODI WC 2023: ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే  వన్డే వరల్డ్ కప్ పై  భారత క్రికెట్ నియంత్రణ మండలి  (బీసీసీఐ) త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నది. 

ఈ ఏడాది భారత్ వేదికగా ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ జరుగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ - నవంబర్ లలో జరుగబోయే ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్, వేదికలు, ఇతరత్రా వివరాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఐపీఎల్ -16 ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో దీనిపై బీసీసీఐ కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఈ నెల 27న అహ్మదాబాద్ వేదికగా కీలక సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. 

క్రిక్ బజ్ లో వచ్చిన సమాచారం మేరకు.. ఈనెల 27న బీసీసీఐ అహ్మదాబాద్ లో స్పెషల్ జనరల్ మీటింగ్ (ఎస్‌జీఎం) నిర్వహించనుంది. ప్రత్యేకించి ఐదు అంశాల ఎజెండాతో ఈ సమావేశం జరుగనుంది. ఇందులోనే ‘ఫార్ములేషన్ ఆఫ్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ది ఐసీసీ వరల్డ్ కప్ 2023’ ను ప్రకటించే అవకాశముంది.

అంతేగాక ఇదే సమావేశం తర్వాత వరల్డ్ కప్ ఆడే వేదికల మీద కూడా బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తున్నది. వరల్డ్ కప్ కోసం బీసీసీఐ.. 12 నగరాలను షార్ట్ లిస్ట్ చేసినట్టు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ తో పాటు మొహాలీ, ధర్మశాల, గువహతి లలో మ్యాచ్ లు నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. దీనిపై మే 27న స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు సమాచారం. ఈ సమావేశంలోనే వరల్డ్ కప్ షెడ్యూల్ గురించి కూడా బీసీసీఐ ఓ ప్రకటన చేయనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

డబ్ల్యూటీసీ ఫైనల్ కు టీమిండియా ఇలా.. 

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం భారత జట్టు మే 23న ఇంగ్లాండ్ కు బయలుదేరనుంది. జూన్ 7 నుంచి 11 వరకూ ఆస్ట్రేలియాతో జరుగబోయే ఈ టెస్టు కోసం భారత జట్టు మూడు దశలుగా ఇంగ్లాండ్ వెళ్లనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు ఇంగ్లాండ్ వెళ్లబోయే టీమిండియా.. ఫస్ట్ బ్యాచ్ ఐపీఎల్ లీగ్ స్టేజ్ ముగిసిన తర్వాత మే 23న వెళ్లనుంది. రెండు ప్లేఆఫ్స్ గేమ్స్ ముగిశాక రెండో బ్యాచ్.. మే 30న థర్డ్ బ్యాచ్ వెళ్తుందని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు. 


Scroll to load tweet…