India Squad For SriLanka Test Series: భారత జట్టు వెటరన్ ఆటగాళ్లుగా ఉన్న నలుగురు కీలక సభ్యులపై జాతీయ సెలెక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు వారికి మరో అవకాశమిచ్చిన  సెలెక్టర్లు ఇప్పుడు కొరడా ఝుళిపించారు.  

టీమిండియాలోకి కొత్త రక్తం వస్తున్నది. యువ భారత్ జట్టు ఇటీవలే వెస్టిండీస్ లో అండర్-19 ప్రపంచకప్ నెగ్గింది. మరోవైపు దేశవాళీ తో పాటు ఐపీఎల్ లో తమ ప్రతిభ నిరూపించుకుంటున్న యువ క్రికెటర్లు.. జాతీయ జట్టు కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియాకు టెస్టులలో సీనియర్ ఆటగాళ్లు గా ఉన్న బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, పేసర్ ఇషాంత్ శర్మ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాలను రిటైర్ అయితే బెటరని చెప్పకనే చెప్పింది. వయసు మీద పడుతుండటం, ఆటలో మునపటి ఫామ్ లేకపోవడంతో పాటు యువ క్రికెటర్లు కుప్పలుకుప్పలుగా వస్తుండటంతో ఆ నలుగురిని త్వరలో జరుగబోయే శ్రీలంక సిరీస్ కు పక్కనబెట్టింది. 

విండీస్ తో వన్డే, టీ20 సిరీస్ ముగిశాక శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో ఆ జట్టు మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. అయితే టెస్టులలో పుజారా, రహానే, ఇషాంత్, సాహా లను ఎంపిక చేయబోమని సెలెక్టర్లు వారికి వ్యక్తిగతంగా సమాచారం అందించినట్టు తెలుస్తున్నది. 

ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘సెలెక్టర్లు కొత్తవారికి అవకాశమివ్వాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నలుగురు సీనియర్లపై వేటు పడే అవకాశముంది. ఈ విషయాన్ని వాళ్లకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మరీ చెప్పాం. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర సీనియర్ మేనేజ్మెంట్ సభ్యులతో మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నాం...’ అని తెలిపారు. 

ఇషాంత్, సాహా ల కథ ముగిసినట్టే.. 

టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తో పాటు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కెరీర్ దాదాపు ముగిసినట్టే అనిపిస్తున్నది. ఇషాంత్ లో మునపటి పేస్ లేదు. అదీగాక బుమ్రా, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లతో పాటు కొత్తగా ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్ వంటి బౌలర్లు భారత జట్టులో అద్భుతాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే 33 ఏండ్ల వయసులో ఉన్న ఇషాంత్ మహా అయితే ఇంకో ఇంకో రెండు, మూడేండ్లు క్రికెట్ ఆడే అవకాశముంది.

ఇక సాహా విషయంలో అయితే అతడికి వయసే అడ్డంకి. సాహా కు ఇప్పుడు 37 ఏండ్లు. అతడిని కొనసాగించడానికి సెలెక్టర్లు ఏమాత్రం సాహసించడం లేదు. రిషభ్ పంత్ తో పాటు కెఎల్ రాహుల్ కూడా అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతుండటం.. కొత్త కుర్రాడు కోన భరత్ తో పాటు పదుల సంఖ్యలో వికెట్ కీపర్లు క్యూలో ఉండటంతో సాహా కు కూడా గుడ్ బై చెప్పేశారు సెలెక్టర్లు.. ఈ నేపథ్యంలో త్వరలో జరుగబోయే రంజీలలో ఆడటానికి కూడా ఈ ఇద్దరూ ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే తాము రంజీలు ఆడబోమని ఆయా రాష్ట్ర జట్లకు చెప్పేశారు. 

రహానే, పుజారాలకు ఛాన్స్..? 

అయితే శ్రీలంకతో సిరీస్ లో తప్పించినా తర్వాత జరుగబోయే టెస్టు సిరీస్ లలో రహానే, పుజారాలకు ఛాన్స్ అయితే ఉంది. గతంలో ఈ ఇద్దరూ భారత్ కు ఒంటిచేత్తో విజయాలను అందించారు. దీంతో వీరిపై సెలెక్టర్లు కొంత సాఫ్ట్ కార్నర్ తోనే ఉన్నారు. రంజీలకు వెళ్లి ఫామ్ తో తిరిగి రావాలని వాళ్లకు చెప్పారు. వారం రోజుల క్రితం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. దీంతో రహానే.. త్వరలో ప్రారంభం కాబోయే రంజీ సీజన్ లో ముంబై తరఫున ఆడనున్నాడు. పృథ్వీ షా సారథ్యంలో అతడు ముంబై కి ప్రాతినిథ్యం వహిస్తుండటం గమనార్హం. మరోవైపు పుజారా కూడా రంజీలకు సిద్ధమవుతున్నాడు.