మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్... గతకొంతకాలంగా క్రీడా వర్గాల్లో ఎక్కువగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ ప్రపంచ కప్ ప్రారంభమైన తర్వాత అది మరీ ఎక్కువయ్యింది. ఆ ప్రపంచ కప్ టోర్నీ తర్వాత ధోని క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాలు సైతం ధోని రిటైర్మెంట్ పై స్పందించారు కూడా. అయితే ధోనిగానీ, బిసిసిఐ గానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అయితే తాజాగా వెస్టిండిస్ సీరిస్ సందర్భంగా బిసిసిఐ ధోని రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చింది. 

వరల్డ్ కప్ నుండి టీమిండియా నిష్క్రమించింది కాబట్టి బిసిసిఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) వెస్టిండిస్ పర్యటనపై దృష్టి సారించింది. మరికొద్దిరోజుల్లో టెస్ట్,వన్డే,టీ20 సీరిస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటగాళ్ల ఎంపికపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే  గతకొంతకాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా  తో పాటు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఈ సీరిస్ నుండి విశ్రాంతినివ్వాలని భావిస్తున్నట్లు బిసిసిఐ అధికారి  ఒకరు తెలిపారు. 

''ఈ ప్రపంచ కప్ కు ముందు జరిగిన ఐపిఎల్ నుండే ధోని వెన్నునొప్పితో బాధపడుతూ కూడా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. అంతేకాకుండా ప్రపంచ కప్ లో కూడా అతడి చేతివేలికి గాయమైంది. కాబట్టి అతడికి వెస్టిండిస్ సీరీస్ కు ఎంపిక చేయవద్దని భావిస్తున్నాం. ఈ సీరిస్ తర్వాత భారత జట్టు విరామం లేకుండా క్రికెట్ మ్యాచులు ఆడాల్సి వుంది. దాన్ని దృష్టిలో వుంచుకునే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం'' అంటూ సదరు అధికారి తెలిపారు. 

మరికొంతకాలం ధోని క్రికెట్ కొనసాగించనున్నట్లు బిసిసిఐ అధికారి మాటల ద్వారా తెలుస్తోంది. కాబట్టి ధోని రిటైర్మెంట్ పై జరుగుతున్న ప్రచారం ఈ ప్రకటనతో కొంతకాలం నిలిచిపోయే అవకాశాలున్నాయి.