ప్రపంచకప్‌లో టీమిండియా కథ ముగిసిన తర్వాత ఎక్కువగా వినిపించిన పేరు మహేంద్ర సింగ్ ధోనీ. ఇప్పటికే టెస్టులకు వీడ్కోలు పలికిన ధోనీ.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ధోనికి వీడ్కోలు సమయం వచ్చేసిందని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం వెస్టిండీస్ టూర్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ.

ఈ లిస్ట్‌లో ధోనీ ఎక్కడా కనిపించకపోవడంతో ఎంతోమందికి అనుమానాలు కలిగాయి. టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లకు రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేయడంతో ధోనీ కెరీర్ ముగిసినట్లేనని పుకార్లు వ్యాపిస్తున్నాయి.

ఈ క్రమంలో వాటికి చెక్ పెట్టేందుకు జట్టును ప్రకటించే సమయంలో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. మహీకి ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలో తెలుసునని.. అది అతని వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు.

ఎంఎస్ ధోనీ విండీస్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదని.. అతని గైర్హాజరీ విషయాన్ని తెలియజేశారు. వరల్డ్ కప్ నుంచే తమ దగ్గర ప్రణాళికలున్నాయని.. కానీ ప్రపంచకప్‌లో కొన్ని వ్యూహాలు ఫలించలేదని...పంత్‌కు కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని తాము భావిస్తున్నామన్నాడు.

ధోని భవిష్యత్తు గురించి కూడా అతనితో చర్చించామని ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. స్ట్రైక్ రేట్ గురించి తాము ఆలోచించడం లేదని.. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లను సిద్ధం చేసుకునే ప్రయత్నంలో ఉన్నామన్నారు.

పంత్‌ మూడు ఫార్మాట్లలో ఆడుతాడని... అతనిపై భారం పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రసాద్ వెల్లడించారు. కాగా... రాబోయే రెండు నెలలు ప్రాదేశిక సైన్యంలో పనిచేయాలని భావించిన ధోని.. విండీస్ పర్యటన నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.