BCCI: క్రికెట్ అడ్వైజరీ కమిటీని ప్రకటించిన బీసీసీఐ.. వాళ్లు ఏం చేస్తారంటే..?
BCCI Cricket Advisory Committee: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం కొత్త క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)ని ప్రకటించింది. ముగ్గురు సభ్యులు ఉండే ఈ కమిటీ తక్షణమే మొదలుపెట్టనుంది.

ఇటీవలే చేతన్ శర్మ సారథ్యంలోని జాతీయ సెలక్షన్ కమిటీపై వేటు వేసిన బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ని గురువారం ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో మాజీ క్రికెటర్లు అశోక్ మల్హోత్ర, జతిన్ పరంజేప్, సులక్షణ నాయక్ లు ఉన్నారు. ఈ ముగ్గురితో కూడిన సీఏసీ.. తక్షణమే తన పనిని మొదలుపెట్టనుంది.
సీఏసీ తక్షణ కర్తవ్యంగా ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీని ఎంపిక చేయడం. డిసెంబర్ 15 వరకు గడువున్న ఈ ప్రక్రియకు ఇదివరకే నామినేషన్ల పర్వం ముగిసింది. సుమారు వంద మందికి పైగా ఆశావాహులు సెలక్షన్ కమిటీలో పదవులు ఆశిస్తున్నారు. మరి ఐదుగురితో కూడిన సెలక్షన్ కమిటీలోకి ఎవరు వస్తారో తేల్చేది సీఏసీనే.
సీఏసీలో ఉన్న మల్హోత్ర.. భారత్ తరఫున 7 టెస్టులు, 20 వన్డేలు ఆడాడు. జతిన్ టీమిండియాకు 4 వన్డేలలో ప్రాతినిథ్యం వహించాడు. ఇక సులక్షణ భారత మహిళా క్రికెట్ జట్టులో చాలాకాలం సేవలందించింది. ఆమె తన 11 ఏండ్ల క్రికెట్ కెరీర్ లో రెండు టెస్టులు, 46 వన్డేలు, 31 టీ20లలో ఆడింది.
ఇంకేం చేస్తారు..?
- స్ప్లిట్ కోచింగ్ పై చర్చ.. (టీ20 టీమ్ కోసం స్పెషలైజ్డ్ కోచ్)
-స్ప్లిట్ కెప్టెన్సీ (టీ20లలో రోహిత్ ను తప్పించి హార్ధిక్ కు పగ్గాలు అప్పజెప్పండం పై)
- టీ20 ప్రపంచకప్ లో భారత వైఫల్యంపై సమీక్ష
- ప్రస్తుత కోచ్ ల మీద సమీక్ష
- సెలక్షన్ కమిటీలో రొటేషన్ పాలసీ వంటి విషయాలు చర్చించి వాటిపై బీసీసీఐకి నివేదిక అందజేయడం వీరి పని.