గబ్బా టెస్టులో చారిత్రక విజయం అందుకున్న భారత జట్టుకి రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది బీసీసీఐ. ‘భారత జట్టుకి రూ.5 కోట్లు టీమ్ బోనస్‌గా ప్రకటించింది బీసీసీఐ. క్యారెక్టర్, టాలెంట్ కలగలిపిన అద్భుతమైన ప్రదర్శన ఇది...’ అంటూ ట్వీట్ చేశాడు బీసీసీఐ సెక్రటరీ జే షా.

2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, మూడో స్థానానికి పడిపోయింది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు మళ్లీ టాప్‌లోకి వెళ్లగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది.

సరిగా నెల రోజుల క్రితం డిసెంబర్ 19న ఆడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయి ఘోరపరాజయం చవిచూసిన టీమిండియా... జనవరి 19న గబ్బాలో 32 ఏళ్ల తర్వాత ఆసీస్‌ను మట్టికరిపించి చారిత్రక విజయాన్ని అందుకోవడం విశేషం.