Asianet News TeluguAsianet News Telugu

పురుషుల క్రికెట్‌లో మహిళా అంపైర్లు.. బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం

BCCI: కొద్దిరోజుల క్రితమే మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానంగా వేతనాలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 

BCCI all Set to Introduce Women Umpires in Upcoming Ranji Season, Reports
Author
First Published Dec 6, 2022, 12:04 PM IST

భారత క్రికెట్ లో మరో ముందడుగు దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నది. దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా  పురుషుల క్రికెట్ (అధికారిక మ్యాచ్ లలో) లో  మహిళా అంపైర్లను తీసుకురానుంది. త్వరలో ప్రారంభం కాబోయే రంజీ  ట్రోఫీ - 2022లో భాగంగా  క్రికెట్ అభిమానులు మెన్స్ క్రికెట్ లో ఉమెన్ అంపైర్స్ ను చూడొచ్చు. ఈ మేరకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్టు తెలుస్తున్నది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో వచ్చిన కథనం మేరకు.. ‘త్వరలో మొదలుకాబోయే రంజీ సీజన్ నుంచి మ్యాచ్ లకు ఉమెన్ అంపైర్లు కూడా  అంపైరింగ్ చేయబోతున్నారు. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లలో కూడా మహిళా అంపైర్లను  (భారత్ ఆడే మ్యాచ్ లకు) చూడొచ్చు..’ అని  బీసీసీఐ ప్రతినిధి  ఒకరు తెలిపారు. ఇటీవలే మహిళా క్రికెటర్ల వేతనాలను పురుషులతో సమానంగా పెంచిన బీసీసీఐ తాజాగా మరో చారిత్రక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.  

మహిళా అంపైర్లుగా  వృందా రతి,  జనని నారాయణ్, వేణుగోపాలన్ లు ప్రస్తుతం భారత మహిళా జట్టు ఆడేమ్యాచ్ లకు పనిచేస్తున్నారు. ఈ ముగ్గురే ఇప్పుడు ఉమెన్  అంపైర్లుగా  రంజీలలో కనిపించనున్నట్టు సమాచారం.  

ముంబైకి చెందిన వృందా రతి..  ముంబైలో  స్కోరర్గా పనిచేసేది. కానీ  న్యూజిలాండ్ కు చెందిన అంపైర్ కాతీ క్రాస్ స్పూర్తితో ఆమె  అంపైర్ గా ఎదుగుతోంది.  తమిళనాడుకు చెందిన జనని నారాయణ్  చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలి  మరీ ఈ  వృత్తిలోకి వచ్చింది.  తమిళనాడు క్రికెట్ అసోసియేషన్  నిర్వహించిన  అంపైర్ల ఇంటర్వ్యూలో నెగ్గిన ఆమె తర్వాత బీసీసీఐ నిర్వహించే మ్యాచ్ లకు కూడా  అంపైరింగ్ చేస్తున్నది.  ఇక గాయత్రి వేణుగోపాలన్ కు మొదట్లో క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా తర్వాత ఆట మీద ఆసక్తితో  అన్ని విషయాలనూ తెలుసుకుంది.  

రతి,  నారాయణ్, వేణుగోపాలన్ లు రంజీ సీజన్ రౌండ్ - 2 నుంచి అందుబాటులో ఉంటారు.  డిసెంబర్ లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య  టీ20 సిరీస్ కు వీళ్లు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సిరీస్ ముగిశాక నేరుగా రంజీ మ్యాచ్ లకు హాజరవుతారు.

 

పలు  స్టేట్ అసోసియేషన్ లు   స్థానికంగా జరిగే టోర్నీలలో  ఉమెన్స్ అంపైర్స్ కు అవకాశాలిస్తున్నా బీసీసీఐ మాత్రం వారిని లిస్ట్ ఏ క్రికెట్ కు వారిని పరిగణించలేదు. ముఖ్యంగా పురుషుల క్రికెట్ కు వారిని రికమెండ్ చేయలేదు. కానీ బిగ్ బాష్  వంటి లీగ్స్ తో పాటు ప్రస్తుతం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో కూడా ముగ్గురు మహిళలు మ్యాచ్ రిఫరీలుగా చేస్తుండటంతో బీసీసీఐ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్ లలో కూడా  ఉమెన్ అంపైర్స్ ను  చూడొచ్చని బీసీసీఐ చెప్పడంతో మరికొంతమంది ఔత్సాహిక మహిళలు దీనిని వృత్తిగా చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios