Asianet News TeluguAsianet News Telugu

షకిబ్ స్పిన్ ఉచ్చులో టీమిండియా విలవిల.. పరువు నిలిపిన రాహుల్.. బంగ్లా ముందు ఈజీ టార్గెట్

BANvsIND:బంగ్లాదేశ్ పర్యటనలో  భాగంగా ఆతిథ్య జట్టుతో నేడు తొలి వన్డే ఆడుతున్న  టీమిండియా  తడబడింది. భారత బ్యాటర్లు బంగ్లాదేశ్ వెటరన్ స్పిన్నర్ షకిబ్ అల్ హసన్  స్పిన్ ఉచ్చులో పడ్డారు.  రాహుల్ రాణించకుంటే భారత్ ఆ మాత్రం స్కోరైనా చేసేది కాదు. 

BANvsIND 1st ODI: Shakib Al Hasan Fifer Helps Bangladesh to Restrict India at 186
Author
First Published Dec 4, 2022, 2:44 PM IST

బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టుకు ఊహించని షాక్ తాకింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఢాకా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో  టీమిండియా  బ్యాటింగ్ లో తడబడింది.  వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ (70 బంతుల్లో 73, 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) తప్ప టాపార్డర్, మిడిలార్డర్ తేడాలేకుండా  అందరూ విఫలమయ్యారు.  బంగ్లా వెటరన్ స్పిన్నర్ షకిబ్ అల్ హసన్  ఐదు వికెట్లతో చెలరేగి భారత  బ్యాటింగ్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. షకిబ్ తో పాటు ఎబాదత్ కూడా నాలుగు వికెట్లతో చెలరేగడంతో భారత్.. 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా ఇన్నింగ్స్ ను నిదానంగా ఆరంభించింది.  మ్యాచ్ లో తొలుత కాస్త బౌలర్లకు సహకారం అందించే ఈ పిచ్ పై  బౌలింగ్ ఎంచుకున్న  లిటన్ దాస్ నిర్ణయాన్ని బంగ్లా బౌలర్లు   నిలబెట్టారు. మెహిది హసన్ భారత్ కు తొలి షాకిచ్చాడు. అతడు వేసిన ఆరో ఓవర్  రెండో బంతికి శిఖఱ్ ధావన్ (7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  

23 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది.  ధావన్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. 15 బంతుల్లో 9 పరుగులే చేశాడు. షకిబ్ అల్ హసన్ వేసిన   11వ ఓవర్లో భారత్ కు డబుల్ షాక్ లు తగిలాయి. షకిబ్ 11 ఓవర్లో  రెండో బంతికి రోహిత్ శర్మ (27) క్లీన్ బౌల్డ్ చేయగా.. నాలుగో బంతికి కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను లిటన్ దాస్ అందుకున్నాడు. దీంతో భారత్.. 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. వరుస షాక్ ల తర్వాత  శ్రేయాస్ అయ్యర్ (24), కెఎల్ రాహుల్ లు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.  

39 బంతులాడి 2 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసిన అయ్యర్..  రాహుల్ తో కలిసి నాలుగో వికెట్ కు 43 పరుగులు జోడించాడు.  నెమ్మదిగా ఆడినా వికెట్లు కాపాడుకున్న ఈ జోడీని  ఎబాదత్ హుస్సేన్ విడదీశాడు.  అతడు వేసిన  20 ఓవర్ చివరి బంతికి   అయ్యర్.. వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీమ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.   దీంతో భారత్.. 92 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 

కెఎల్ రాహుల్ తో జతకలిసిన వాషింగ్టన్ సుందర్  (19) మీద భారత్ భారీ ఆశలు పెట్టుకుంది.  కానీ భారత్ కు డబుల్ స్ట్రోక్ ఇచ్చిన షకిబ్.. 32.3 ఓవర్లో మరో షాకిచ్చాడు. సుందర్ కూడా షకిబ్ బౌలింగ్ లోనే నిష్క్రమించాడు.  తర్వాత ఓవర్లో ఎబాదత్.. షాబాద్  (0) ను ఔట్ చేశాడు.  శార్దూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0) లు కూడా షకిబ్ బౌలింగ్ లోనే ఔటయ్యారు. 

 

వరుసగా వికెట్లు కోల్పోతున్నా సహనంగా ఆడిన  రాహుల్..  ఎబాదత్ వేసిన 32 వ ఓవర్లో  రెండు బౌండరీలు బాది  హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.   ఎబాదత్ వేసిన 40 వ ఓవర్లో 6, 4 బాది స్కోరునపు పెంచే యత్నం చేసిన  రాహుల్.. అదే ఓవర్లో ఐదో బంతికి అనముల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  తర్వాత సిరాజ్ (9) కూడా ఎబాదత్ బౌలింగ్ లోనే మహ్మదుల్లాకు క్యాచ్ ఇవ్వడంతో భారత ఇన్నింగ్స్  41.2 ఓవర్ల వద్ద (186) ముగిసింది. 

బంగ్లా బౌలర్లలో షకిబ్ అల్ హసన్ ఐదు వికెట్లు తీయగా ఎబాదత్ హుసేన్ నాలుగు వికెట్లు తీశాడు. మెహది హసన్ కు ఒక వికెట్ దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios