Asianet News TeluguAsianet News Telugu

ఒక్క వికెట్ తీయలేక.. బంగ్లా చేతిలో భారత్ కు భంగపాటు.. మెహిది హసన్ సూపర్ షో..

BANvsIND: విజయం చివరి అంచువరకూ వచ్చిన  టీమిండియా ఒక్క వికెట్ తీయలేక చతికిలపడింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో భారత బౌలర్లు  అద్భుతంగా పోరాడినా బంగ్లా  బ్యాటర్ మెహిది హసన్ మిరాజ్ సూపర్ షో తో  ఆతిథ్య జట్టు  థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. 

BANvsIND 1st ODI: Mehidy Hasan Miraz Stars as Bangladesh Beat India By 1 Wicket
Author
First Published Dec 4, 2022, 7:21 PM IST

బంగ్లాదేశ్ తో  ఢాకా వేదికగా  ఉత్కంఠభరితంగా సాగిన తొలి వన్డే లో   ఆతిథ్య జట్టు థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. స్వల్ప లక్ష్యాన్ని  కాపాడుకునే క్రమంలో భారత బౌలర్లు   అద్భుతంగా  పోరాడినా బంగ్లాదేశ్  లోయర్ ఆర్డర్ బ్యాటర్ మెహిది హసన్ మిరాజ్ (39 బంతుల్లో 38 నాటౌట్) మెరుపులతో  ఆ జట్టు ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్.. 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 136కే 9 వికెట్లు కోల్పోయిన దశలో   చివరి వరుస బ్యాటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (10 నాటౌట్) తో కలిసి  మిరాజ్ ఓ చిన్నపాటి యుద్దమే చేశాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుని చివరి వికెట్ కు హాఫ్ సెంచరీకి పైగా భాగస్వామ్యం జోడించి బంగ్లాకు ఊహించని విజయాన్ని అందించాడు.  46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి బంగ్లా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 9 వికెట్లు తీసిన భారత బౌలర్లు.. చివరి వికెట్ తీసే క్రమంలో విఫలమయ్యారు. ఈ విజయంతో బంగ్లా.. మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డే ఇదే వేదికపై  ఈనెల 7న జరుగుతుంది. 

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ కు తొలి బంతికే షాక్ తాకింది. దీపక్ చాహర్ వేసిన  తొలి ఓవర్లో  మొదటి బంతికే  షాంతో (0).. స్లిప్స్ లో  ఉన్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు.  చాహర్ తో పాటు సిరాజ్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాకు పరుగుల రాక గగనమైంది.  

29 బంతులాడిన అనముల్ 14 పరుగులు చేసి  సిరాజ్  వేసిన పదో ఓవర్ తొలి బంతికి వాషింగ్టన్ సుందర్ కు క్యాచ్ ఇచ్చాడు. పది ఓవర్లకు బంగ్లా స్కోరు 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు. ఈ సిరీస్ లో బంగ్లాకు సారథిగా వ్యవహరిస్తున్న లిటన్ దాస్ (63 బంతుల్లో  41, 3 ఫోర్లు, 1 సిక్సర్) షకిబ్ అల్ హసన్ (38 బంతుల్లో 29, 3 ఫోర్లు) తో కలిసి  బంగ్లా ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 48 పరుగులు జోడించారు. అయితే 63 బంతులాడిన  లిటన్ దాస్.. వాషింగ్టన్ సుందర్ వేసిన 20 ఓవర్ రెండో బంతికి  వికెట్ కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు.  20 ఓవర్లు ముగిసేరికి  బంగ్లా..  3 వికెట్లు కోల్పోయి  77 పరుగులు చేసింది. 

భారత  బ్యాటింగ్ వెన్ను విరిచిన షకిబ్.. షాబాజ్ అహ్మద్ వేసిన  23వ ఓవర్లో రెండు బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు. కానీ  వాషింగ్టన్ భారత్ కు మరో బ్రేక్ ఇచ్చాడు. 23.2 వ ఓవర్లో  సుందర్.. షకిబ్ ను  పెవిలియన్ కు పంపాడు.    దీంతో బంగ్లా నాలుగో వికెట్ కోల్పోయింది. 

ఇద్దరు సెట్ బ్యాట్స్మెన్ నిష్క్రమించాక  ముష్ఫీకర్ రహీమ్ (18), మహ్మదుల్లా (14) లు క్రీజులోకి వచ్చారు.  ఈ ఇద్దరూ   పరుగులు చేయలేకపోయినా  బౌలర్లను కొంతసేపు అడ్డుకున్నారు.   ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు   33 పరుగులు జోడించారు. వీరి జోడీ కుదురుకుంటున్న తరుణంలో  శార్దూల్ ఠాకూర్ బంగ్లాకు షాకిచ్చాడు. ఠాకూర్ వేసిన  35వ ఓవర్ తొలి బంతికి  మహ్ముదుల్లా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత ఓవర్ లో ముష్ఫీకర్ ను  సిరాజ్ బౌల్డ్ చేశాడు.  మ్యాచ్ లో ఇదే టర్నింగ్ పాయింట్. అప్పటికీ బంగ్లాదేశ్.. 35 ఓవర్లలో 6 వికెట్లకు  128 పరుగులు. 

ఒత్తిడిని అధిగమించని బలహీనత ఉన్న బంగ్లాదేశ్.. వరుసగా వికెట్లు కోల్పోవడంతో తడబడింది. ముష్పీకర్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన అఫిఫ్ హోసేన్ (6) ను  కుల్దీప్ సేన్ ఔట్ చేశాడు. కుల్దీప్ వేసిన 39వ ఓవర్లో అఫిఫ్.. భారీ షాట్ ఆడేందుకు యత్నించగా  డీప్ థర్డ్ మెన్ వద్ద సిరాజ్ క్యాచ్ అందుకున్నాడు. వన్డేలలో  తొలి మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్ సేన్ కు ఇది తొలి వికెట్. అదే ఓవర్లో ఐదో బంతికి ఎబాదత్ హోసేన్..  హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. హసన్ మహ్మద్ (0) ను సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు.

మెహిది పోరాటం.. 

136కే 9 వికెట్లు కోల్పోయి విజయానికి మరో 50 పరుగులు అవసరముండగా  చివరి వరుస బ్యాటర్  ముష్ఫీకర్ తో కలిసి  మెహిది ఓ చిన్నపాటి యుద్ధమే చేశాడు.   కుల్దీప్ సేన్ వేసిన 41 వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అతడు ఇచ్చిన  క్యాచ్ ను వికెట్ కీపర్ రాహుల్ నేలపాలు చేశాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న  మెహిది..  తర్వాత   స్ట్రైక్ ను ఎక్కుగా తన వద్దే ఉంచుకుని  భారత బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకున్నాడు.  దీపక్ చాహర్ వేసిన 44వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి బంగ్లాను విజయానికి దగ్గర చేశాడు. ఠాకూర్ బైలింగ్ లో ఫోర్ బాదిన  మెహిది.. దీపక్ చాహర్ వేసిన  46వ ఓవర్లో తొలి బంతికి బౌండరీ  కొట్టాడు.  నాలుగో బంతికి  చాహర్  నోబాల్ విసిరాడు. దానికి ఒక పరుగు కూడా లభించింది. ఇక చివరిక బంతికి సింగిల్ తీసిన మిరాజ్ బంగ్లాకు మరుపురాని విజయాన్ని అందించాడు. 

అంతకుముందు ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియాలో కెఎల్ రాహుల్ (73) తప్ప ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు.  రోహిత్ శర్మ (27) ఫర్వాలేదనిపించినా ధావన్ (7), కోహ్లీ (9), శ్రేయాస్ అయ్యర్ (24), వాషిగ్టన్ సుందర్ (19), షాబాజ్ అహ్మద్ (0), శార్దూల్ (2), దీపక్ చాహర్ (0) లు విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకిబ్ అల్ హసన్ కు ఐదు వికెట్లు దక్కగా ఎబాదత్ హోసేన్ కు నాలుగు వికెట్లు దక్కాయి.   

Follow Us:
Download App:
  • android
  • ios