Asianet News TeluguAsianet News Telugu

బెంబేలెత్తిస్తున్న బంగ్లా బౌలర్లు.. తొలి వన్డేలో టీమిండియాకు కష్టాలు.. రోహిత్, కోహ్లీ, ధావన్, అయ్యర్ ఔట్

BANvsIND: ఢాకా వేదికగా బంగ్లాదేశ్ -ఇండియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో బంగ్లా బౌలర్లు  దూకుడుమీదున్నారు. స్వదేశంలో తమకు అనుకూలించే పిచ్ లపై   రెచ్చిపోతున్నారు.  భారత టాపార్డర్ దారుణంగా విఫలమైంది. 

BANvsIND 1st ODI: India 4 Down, Rohit, Virat, Dhawan and Shreyas Got Out Early
Author
First Published Dec 4, 2022, 1:21 PM IST

బంగ్లాదేశ్ తో  మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఢాకా వేదికగా జరుగుతున్న  తొలి వన్డేలో భారత్ తడబడుతోంది.  టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన  భారత్  ను టాపార్డర్ వైఫల్యం దెబ్బతీసింది.  టీ20 ప్రపంచకప్ లో విఫలమైన  సారథి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ లు దారుణంగా విఫలమయ్యారు. టాప్ - 4 బ్యాటర్లు  విఫలమవడంతో భారత జట్టు  20 ఓవర్లు ముగిసేసరికి  నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 92 పరుగులే చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా ఇన్నింగ్స్ ను నిదానంగా ఆరంభించింది.  మ్యాచ్ లో తొలుత కాస్త బౌలర్లకు సహకారం అందించే ఈ పిచ్ పై  బౌలింగ్ ఎంచుకున్న  లిటన్ దాస్ నిర్ణయాన్ని బంగ్లా బౌలర్లు   నిలబెట్టారు. 

మెహిది హసన్ భారత్ కు తొలి షాకిచ్చాడు. అతడు వేసిన ఆరో ఓవర్  రెండో బంతికి శిఖఱ్ ధావన్ (7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  23 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది.  ధావన్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. 15 బంతుల్లో 9 పరుగులే చేశాడు. షకిబ్ అల్ హసన్ వేసిన   11వ ఓవర్లో భారత్ కు డబుల్ షాక్ లు తగిలాయి.  

షకిబ్ 11 ఓవర్లో  రెండో బంతికి రోహిత్ శర్మ (27) క్లీన్ బౌల్డ్ చేయగా.. నాలుగో బంతికి కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను లిటన్ దాస్ అందుకున్నాడు. దీంతో భారత్.. 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. వరుస షాక్ ల తర్వాత  శ్రేయాస్ అయ్యర్ (24), కెఎల్ రాహుల్ లు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.  

39 బంతులాడి 2 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసిన అయ్యర్..  రాహుల్ తో కలిసి నాలుగో వికెట్ కు 43 పరుగులు జోడించాడు.  నెమ్మదిగా ఆడినా వికెట్లు కాపాడుకున్న ఈ జోడీని  ఎబాదత్ హుస్సేన్ విడదీశాడు.  అతడు వేసిన  20 ఓవర్ చివరి బంతికి   అయ్యర్.. వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీమ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.   దీంతో భారత్.. 92 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 

 

25 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు.. 4 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.  కెఎల్ రాహుల్ (31 బంతుల్లో 21 నాటౌట్) వాషింగ్టన్ సుందర్ (17 బంతుల్లో 7 నాటౌట్) క్రీజులో ఉన్నారు. టీమిండియా బంగ్లాదేశ్ ముందు మోస్తారు లక్ష్యాన్ని నిలపాలన్నా ఈ ఇద్దరూ మరికొంతసేపు క్రీజులో ఉండాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios