ఢాకా: క్రికెట్ అంటే ఆమెకు ప్రాణం. ఆ ఇష్టంతోనే కష్టపడి అంతర్జాతీయ క్రికెటర్ గా మారింది. క్రికెట్ తప్ప వేరే ప్రపంచమే తెలియని ఆమె తన పెళ్లి వేడుకల్లో కూడా బ్యాట్ పట్టింది. ఇలా పెళ్లి దుస్తుల్లో బ్యాట్ పట్టి ఫోటోలకు ఫోజిస్తూ అందరనీ ఆకట్టుకుంది బంగ్లాదేశ్ మహిళ జట్టు ప్లేయర్ సంచితా ఇస్లామ్. 

బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ సంచితాకు దేశవాళి క్రికెటర్ మిమ్ మొసాద్దెక్ తో కొద్దిరోజుల క్రితమే వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు ఈ జంట ఫోటో షూట్ జరిగింది. ఈ సందర్భంగా సంచితా బ్యాట్ పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చి తనకు క్రికెట్ పై వున్న అభిమానాన్ని చాటుకుంది. 

పెళ్లి దుస్తుల్లో బ్యాట్ పట్టుకుని వున్న ఆమె ఫోటోలను ఓ స్పోర్ట్స్ ఛానల్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు క్రీడా ప్రియులనే కాదు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో వారు లైకులు, షేర్ లు చేస్తుండటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి, 
 
2014లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సంచితా ఇస్లామ్‌ 14 వన్డేలు, 32 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఆసియా కప్‌లో ఆరుసార్లు ఛాంపియన్‌ జట్టయిన భారత్‌ను ఓడించి 2018లో మొట్టమొదటిసారి ఆ ప్రతిష్టాత్మక కప్‌ గెలిచిన బంగ్లా జట్టులో సభ్యురాలు కూడా ఈ సంచితా ఇస్లామ్.